ట్రంప్ కొంపముంచుతున్న కరోనా

ట్రంప్ కొంపముంచుతున్న కరోనా
  • నేషనల్ పోల్ లో పడిపోతున్న అధ్యక్షుడి గ్రాఫ్
  • ట్రంప్ కన్నా జో బిడెన్ కే జనం మొగ్గు

వాషింగ్టన్ : అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ట్రంప్ కొంపముంచేలా ఉంది. లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాల కారణంగా ప్రజల్లో క్రమంగా ఆయనపై నమ్మకం తగ్గుతోంది. ఇది ఈ ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పదవికి ఎసరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ కన్నా కూడా వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీ చేయనున్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ వైపు జనం మొగ్గుచూపుతున్నారు. తాజాగా ‘యూఎస్‌ఏ టుడే- సఫ్లోక్ యూనివర్సిటీ పోల్‌’ నిర్వహించిన సర్వేలో అమెరికన్లు జో బిడెన్ కే జై కొట్టారు. ఆయనకు 42 శాతం మంది సపోర్ట్ చేయగా ట్రంప్ కు 38 శాతం మంది ఓటేశారు. నాలుగు నెలల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన నేషనల్ పోల్ లో జో బిడెన్ కన్నా మూడు పాయింట్లు ట్రంప్ ఆధిక్యం సాధించారు. కానీ ప్రస్తుతం కరోనా ను ట్రంప్ సరిగా డీల్ చేయలేదన్న భావనలో అమెరికన్లు ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అధ్యక్ష ఎన్నికల నాటికి ప్రజల్లో ట్రంప్ పై మరింత వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది.
స్ట్రాంగ్ లీడర్లైతే కాదు
అమెరికన్లు ట్రంప్ ను గానీ జో బిడెన్ ను గానీ స్ట్రాంగ్ లీడర్లుగా భావించటం లేదు. బలమైన లీడర్ గా ఇద్దరికి ఎంతమంది సపోర్ట్ చేస్తారని సర్వే చేయగా ఎక్కువ శాతం మంది వీళ్లు స్ట్రాంగ్ లీడర్లు కాదని తేల్చేశారు. ట్రంప్ స్ట్రాంగ్ లీడర్ అని 45 శాతం చెప్పగా 52 శాతం మంది కాదని చెప్పారు. జో బిడెన్ కు సైతం 43 శాతం మంది బలమైన లీడర్ గా 47 శాతం మంది బలహీనమైన లీడర్ అంటూ ఓట్లు వేశారు. ఐతే పనులు ఎలా చేయాలో ఎవరికి బాగా తెలుసన్న సర్వేలో మాత్రం ట్రంప్ వైపు 51 శాతం మొగ్గుచూపగా…48 శాతం జో బిడెన్ కు సపోర్ట్ చేశారు. ‘ది రియల్‌ క్లియర్పాలిటిక్స్‌’ అనే మరో సంస్థ నిర్వహించిన పోల్ లోనూ ట్రంప్ కన్నా జో బిడెన్ 6.3 పాయింట్ల అధిక్యం సాధించారు.
ఎన్నికల వాయిదా వేసేది లేదు
నవంబర్ 3 న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేసేది లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి జో బిడెన్ కోరినప్పటికీ ట్రంప్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కరోనా కారణంగా ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అవుతాయా అని మీడియా ప్రశ్నించగా ‘ఏదేమైనా అధ్యక్ష ఎన్నికల తేదీల్లో మార్పులు ఉంటాయని నేననుకోవడం లేదు. అలా ఎందుకు చేయాలి? నవంబర్‌ 3 మంచి తేదీ’ అని ట్రంప్ అన్నారు.