750 కోట్లతో నగల ఫ్యాక్టరీ

750 కోట్లతో నగల ఫ్యాక్టరీ
  • రాష్ట్రంలో మలబార్​ ​రిఫైనరీ, జ్యువలరీ యూనిట్లు  

హైదరాబాద్, వెలుగు: జ్యువలరీ రంగంలో పేరొందిన మలబార్​ గ్రూప్​ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. గోల్డ్​, డైమండ్​ జ్యువలరీ తయారు చేయడానికి ఫ్యాక్టరీతోపాటు, గోల్డ్​ రిఫైనరీ కూడా పెట్టడానికి రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 750 కోట్లను వెచ్చించాలనుకుంటున్నట్లు మలబార్​ గ్రూప్​ చైర్మన్​ ఎం పీ అహ్మద్​ వెల్లడించారు. బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే టీ రామారావును మలబార్​ గ్రూప్​ ప్రతినిధులు కలిశారు. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు, అనుకూలమైన ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్లే ఇక్కడ కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టనున్నట్లు అహ్మద్​ ఈ సందర్భంగా చెప్పారు. తమ ప్రాజెక్టుల వల్ల 2500 మంది నిపుణులైన స్వర్ణకారులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చిన మలబార్​ గ్రూప్​ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, అన్ని విధాలుగా సాయం చేస్తామని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​ పాలసీలు మలబార్​ గ్రూప్​కు నచ్చడం ఆనందం కలిగిస్తోందని చెప్పారు.  తెలంగాణలో నిపుణులయిన స్వర్ణకారులకు కొదవ లేదని, వారి ఉపాధి అవకాశాలు పెరగడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఇక్కడి నిపుణులలో వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మలబార్​ గ్రూప్​ను మంత్రి కేటీఆర్​ ఈ సందర్భంగా కోరారు.మలబార్​ గ్రూప్​కు దేశ, విదేశాలలో 260 జ్యువలరీ స్టోర్లున్నాయి. తెలంగాణలో ప్రపోజ్​ చేస్తున్న కొత్త ప్రాజెక్టుతో తమ మాన్యుఫాక్చరింగ్​ మరింత బలోపేతమవుతుందనే ఆశాభావాన్ని మలబార్​ గ్రూప్​ వ్యక్తం చేస్తోంది. మలబార్​ గ్రూప్​ ప్రతినిధులతోపాటు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్​ రంజన్​, ఇతర ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.