అర్థరాత్రి జార్ఖండ్ చేరిన వలస కూలీల స్పెషల్ ట్రైన్

అర్థరాత్రి జార్ఖండ్ చేరిన వలస కూలీల స్పెషల్ ట్రైన్

హైదరాబాద్‌, సంగారెడ్డి, వెలుగు:లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకుపోయిన జార్ఖండ్ కార్మికులు శుక్రవారం రాత్రి సొంత రాష్ట్రానికి చేరుకున్నరు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ స్పెషల్​ ట్రైన్​లో జార్ఖండ్​లోని హాతియాకు చేరారు. లింగంపల్లి నుంచి ఉదయం 4:50 గంటలకు బయలుదేరిన ఈ ట్రైన్​ ఎక్కడా ఆగకుండా రాత్రి 11 గంటలకు గమ్యం చేరింది. లాక్​ డౌన్​ విధించిన తర్వాత నడిచిన తొలి ప్యాసింజర్​ ట్రైన్​ ఇదే కావడం విశేషం. దీంతో పాటు కేరళ, పంజాబ్, బీహార్ లలో కూడా వలస కార్మికుల కోసం రైల్వే శాఖ స్పెషల్​ ట్రైన్స్ నడిపించింది. ఈ ట్రైన్​లోని 24 కోచ్‌లలో 1225 మంది కార్మికులను తరలించారు. ఇందులో ఎక్కువ మంది కంది ఐఐటీ భవన నిర్మాణ కార్మికులు కాగా మరికొంత మందిని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారని సమాచారం.

స్టేషన్​ చుట్టూ కాపలా..

కార్మికులను పంపించే క్రమంలో అధికారులు లింగంపల్లి స్టేషన్‌ మొత్తం బారికేడ్‌ చేశారు. ఇతరులు లోపలికి రాకుండా స్టేషన్‌కు అన్ని వైపుల ఆర్పీఎఫ్‌, జీఆర్పీ, లోకల్‌ పోలీసులను కాపలా పెట్టారు. ట్రైన్ ఎక్కేముందు ప్రతీ కార్మికుడికి థర్మల్​ స్క్రీనింగ్​ చేశారు. ఒక్కో కోచ్​లో 54 మందినే ఎక్కించారు. ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లను అధికారులు అందించారు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, రైల్వే, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో వ్యవహరించడంతో స్పెషల్​ ట్రైన్‌ సాఫీగా వెళ్లిపోయింది. లింగంపల్లి నుంచి బయలుదేరిన ఈ రైలు సికింద్రాబాద్, కాగజ్ నగర్, ఢిల్లీ మీదుగా హాతియా చేరుకుంది.

అంతా సీక్రెట్..

కార్మికుల తరలింపుపై అధికారులు సీక్రెసీ మెయింటెయిన్​ చేశారు. ఈ ప్రక్రియను అధికారులు గురువారం రాత్రి నుంచే ప్రారంభించారు. 56 ఆర్టీసీ బస్సులు ఉపయోగించినా పూర్తి వివరాలు వారికి కూడా చెప్పలేదని ఓ ఉన్నతాధికారి చెప్పారు.

6 శ్రామిక్​ స్పెషల్​ ట్రైన్స్

లాక్​డౌన్​తో వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నోళ్లను ప్రత్యేక రైళ్లలో వారివారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్ర హోంశాఖ శుక్రవారం అనుమతించింది. ఇందులో భాగంగా వివిధ రూట్లలో 6 శ్రామిక్​ స్పెషల్​ ట్రైన్స్ ను నడిపింది.

1.హైదరాబాద్-​ హాతియా(జార్ఖండ్)

2.నాసిక్(మహారాష్ట్ర)- ‌‌లక్నో(పశ్చిమ బెంగాల్)

3.అలువ(కేరళ)- భువనేశ్వర్( ఒడిశా)

4.నాసిక్(మహారాష్ట్ర)- భోపాల్(మధ్యప్రదేశ్)

5.జైపూర్(రాజస్థాన్)- పాట్నా(బీహార్)

6.కోటా(రాజస్థాన్)- హాతియా(జార్ఖండ్)

ఏపీలోకి నో ఎంట్రీ బోర్డర్​లో అడ్డుకున్న అధికారులు

వెలుగు, భద్రాచలం: నెలరోజులుగా పనుల్లేక, తినడానికి తిండిలేక సొంతూళ్లకు పోదామని కాలినడకన బయలుదేరిన ఆదివాసీ కూలీలను అధికారులు అడ్డుకున్నరు. వాళ్లందరినీ క్యాంపులకు తరలించారు. ఇప్పుడేమోవలస కూలీలు సొంతూళ్లకు వెళ్లొచ్చన్న కేంద్ర ప్రకటనతో అధికారులే వెహికల్స్ ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయినవాళ్లను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆశతో వెళుతున్న వాళ్లను సరిహద్దుల్లో ఆంధ్రా అధికారులు అడ్డుకున్నరు. అందరినీ వెనక్కి పంపడంతో తిరిగి భద్రాచలం వచ్చి ఉండిపోయారు.