Jharkhand shocker: నాలుగు రోజుల పసికందును కాలి బూట్లతో తొక్కిన పోలీసులు

Jharkhand shocker: నాలుగు రోజుల పసికందును కాలి బూట్లతో తొక్కిన పోలీసులు

ఇప్పుడే పుట్టిన పిల్లలు చిన్న దెబ్బ తాకితేనే విలవిలలాడిపోతారు. అలాంటి కాలి బూటు కింద నలిగిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది వినడానికే బాధగా అనిపిస్తుంది కదా. కానీ ఈ తరహా ఘటనే జార్ఖండ్ లో జరిగింది. పోలీసులు కాలి బూట్లతో తొక్కడం వల్ల ఓ నవజాత శిశివు మరణించింది. అత్యంత దిగ్ర్భాంతి కలిగించే ఈ ఘటన గిరిదిహ్ జిల్లాలో మార్చి 22న జరిగింది. ఈ విషయం రీసెంట్ గా వెలుగులోకి రావడంతో అక్కడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు. 

ప్రాథమిక వివరాల ప్రకారం.. ఒక కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడానికి పోలీసు సిబ్బంది డియోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోశోడింఘి గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయిన సీనియర్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేయడం గమనార్హం. కోర్టు జారీ చేసిన రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్లినప్పుడు నాలుగు రోజుల పసికందు చనిపోయిందని ఆరోపణలు వచ్చాయి. శిశువు శరీరంపై ఎలాంటి గాయాలు మాత్రం లేవని గిరిడిహ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రేణు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే అసలు ఏం జరిగిందో చెప్పగలమన్నారు. మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో వైద్య నిపుణుల బృందం వీడియోగ్రఫీతో శవపరీక్ష నిర్వహిస్తుందని రేణు పేర్కొన్నారు. 

ప్రస్తుతానికైతే ఏ పోలీసు పసికందును చితకబాదినట్లు తమకు సమాచారం లేదని, ఆరోపణ నిజమని తేలితే, తప్పు చేసిన సిబ్బందిని వదిలిపెట్టమని ఎస్పీ రేణు స్పష్టం చేశారు. చనిపోయిన శిశువు తాత భూషణ్ పాండే , మరొక వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేయడానికి పోలీసు సిబ్బంది వెళ్లారని, అప్పుడే ఈ ఆరోపణలు వచ్చాయన్నారు.

ఘటన దారుణం 

ఈ అమానుష ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత హేయమైన ఘటనగా పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఈ ఘటనలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరేమో సీఎం హేమంత్ సోరెన్ పై మండిపడుతున్నారు. ముందుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, నవజాత శిశువును చంపిన పోలీసులను జైలుకు పంపండని కోరుతున్నారు. లేదంటే ఆ పాపంలో మీరూ భాగస్వామ్యం అవుతారని అంటున్నారు. నాలుగు రోజుల పసిపాపది 'సర్కారీ హత్య' అని ఇంకొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.