మ్యూజిక్​ అంతగా తెలియదంటూనే.. మది దోచుకున్నాడు

మ్యూజిక్​ అంతగా తెలియదంటూనే.. మది దోచుకున్నాడు

వెంకట సుధాంశు.. జీ సరిగమప ‘ది సింగింగ్​ సూపర్​ స్టార్’​​​​ రన్నరప్​గా అందరికీ తెలుసు​​. కానీ, ఆ గెలుపు​కి ముందే ఓ సినిమాకి టైటిల్​ ట్రాక్​ పాడాడు. ‘భీమ్లానాయక్​, ఆచార్య’ సినిమాల కోరస్​లోనూ ఇతని గొంతు వినిపించింది. ఓ ఇండిపెండెంట్​ సినిమాకి బ్యాక్​గ్రౌండ్​ స్కోర్ కూడా ఇచ్చాడు. అందులో రెండు పాటలకి ట్యూన్స్​  కట్టాడు. సరిగమప వేదికపై సుధాంశు ఇచ్చిన  మ్యాజికల్​ పర్ఫార్మెన్స్​లే.. ఈ అవకాశాలన్నీ అతన్ని వెతుక్కుంటూ వచ్చేలా చేశాయి. మ్యూజిక్​ అంతగా తెలియదంటూనే తన గొంతుతో ఎంతో మంది మనసు దోచుకున్నాడు.

నా పూర్తి పేరు జిల్లెళ్ళమూడి వెంకట సుధాంశు. అందరూ షార్ట్​కట్​లో జె. వి సుధాంశు అని పిలుస్తుంటారు. మా నాన్న వెంకటేశ్వర ప్రసాద్​ సెంట్రల్​ గవర్నమెంట్​ ఉద్యోగి. దాంతో నాన్నకి ట్రాన్స్​ఫర్​ అయినప్పుడల్లా మా  పోస్టల్​ అడ్రస్ మారుతుండేది. అమ్మ  పద్మిని ప్రియదర్శిని ప్రైవేట్​ ఇంగ్లీషు లెక్చరర్​ కావడంతో  నాన్న ట్రాన్స్​ఫర్​ని బట్టి తనూ కాలేజీలు మారుతుండేది. అలా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రస్తుతం హైదరాబాద్​లో ఉంటున్నాం. మ్యూజిక్​ విషయానికొస్తే నాన్న వీణ వాయిస్తారు. బాగా పాడతారు కూడా.  అలా నాన్న నుంచి వారసత్వంగా మ్యూజిక్​ అబ్బింది కాబోలు. 

మూడు నెలలకి మించి

నా ఆరేండ్లప్పుడు తెలిసినవాళ్లు చిన్న కీబోర్డు గిఫ్ట్​ ఇచ్చారు. ఆ టైంలోనే టీవీలో మన్మథుడు సినిమా వస్తుండటంతో.. అందులోని పాటలకు తగ్గట్టు కీబోర్డు వాయించానట. ఎలాంటి ప్రాక్టీస్​ లేకుండానే పాటల్ని ట్యూన్​లో పాడానట. అది గమనించిన నాన్న ఆ మరుసటి రోజే నన్ను కీబోర్డు క్లాసులో చేర్పించారు.  కర్నాటక సంగీతంలో  బేసిక్స్​ నాన్నే నేర్పించారు. కానీ, ఆ తర్వాత నేను పెద్దగా మ్యూజిక్​పై ఇంట్రెస్ట్​ పెట్టలేదు.  మూడు నెలలకి మించి  ట్రైనింగ్​ ఏ గురువు దగ్గరా తీసుకోలేదు. ఎందుకంటే ఆ మూడు నెలల గ్యాప్​లో నా బకెట్​ లిస్ట్​లో క్రికెట్​, బాస్కెట్​బాల్​, కవితలు రాయడం ఇలా బోలెడు ఇష్టాలు వచ్చి చేరేవి.  వీటన్నింటిలో ఒకటిగా మ్యూజిక్​ నేర్చుకోవడాన్ని చూసేవాడ్నే తప్ప , ప్రత్యేకమైన ఇంట్రెస్ట్​ ఏం పెట్టలేదు. అలాగని మ్యూజిక్​ని పూర్తిగా పక్కనపెట్టలేదు. చుట్టు పక్కల  మ్యూజిక్​ కాంపిటీషన్స్ ఎక్కడ​ జరిగినా వెళ్లేవాడ్ని.  

మళ్లీ మ్యూజిక్​ మొదలుపెట్టా

పన్నెండేండ్ల వయసులో.. ‘సరిగమప లిటిల్​ ఛాంప్స్​, పాడుతా తీయగా’ లాంటి రియాలిటీ షోలకి ఆడిషన్స్​ ఇచ్చా. కానీ, సెలక్ట్​ కాకపోవడంతో  డిసప్పాయింట్​ అయ్యా. ఒక విధంగా చెప్పాలంటే మ్యూజిక్​ని పక్కనపెట్టా. మళ్లీ బీటెక్​లో  మా సీనియర్​తో కలిసి ఒక ఆన్​లైన్​ మ్యూజిక్​ కాంపిటీషన్​లో పార్టిసిపేట్​ చేసి టాప్​–5 వరకు వెళ్లా. అప్పుడు కాన్ఫిడెన్స్​ వచ్చింది. కానీ, ఆలోపే బీటెక్​ పూర్తయింది. ఉద్యోగం వచ్చింది. కానీ, శాటిస్​ఫాక్షన్​ లేక మూడేండ్లకే ఉద్యోగం మానేశా. నాకిష్టమైన మాస్టర్​ ఆఫ్​ డిజైనింగ్​లో చేరా. వైజర్సు సుబ్రహ్మణ్యం దగ్గర మ్యూజిక్​ క్లాసులో చేరా. కీబోర్డు మళ్లీ మొదలుపెట్టా. కానీ, ఆలోపే కరోనా వల్ల మ్యూజిక్​కి బ్రేక్​ పడింది. చదువు ఆన్​లైన్​లోకి వచ్చింది. అప్పుడే సరిగమప ఆడిషన్స్​ గురించి టీవీలో చూశా. 

ఇదొక అఛీవ్​మెంట్​గా..

నా ఇరవై ఐదో బర్త్​డేకి నాకు నేను స్పెషల్​ గిఫ్ట్​ ఇచ్చుకోవాలనుకున్నా. ఏదైనా అఛీవ్​ చేయాలనుకున్నా. నా ప్యాషన్​లో సక్సెస్​ అవ్వాలనుకున్నా. ఆ ఆలోచనతోనే సరిగమపకి ఆడిషన్​ ఇవ్వాలనుకున్నా. ఆ ప్రయత్నంలో ఇంతకుముందు నేను సెలక్ట్​ కాకపోవడానికి కారణాల్ని వెతికి సరిచేసుకున్నా. మునుపటి​ సీజన్​ కంటెస్టెంట్స్​ని​ కలిసి..ఎలాంటి  పాటలు సెలక్ట్​ చేసుకోవాలి?  షోకి వెళ్లాలంటే మ్యూజిక్​ పరంగా ఏమేం తెలుసుండాలి? అనేవి అడిగా. అన్నీ ఫలించి  కంటెస్టెంట్​గా షోలో అడుగుపెట్టా. మొదట మూడు, నాలుగు రౌండ్స్​ వరకే నా టార్గెట్ ఉండేది. ఆ తర్వాత మెల్లిగా  మ్యూజిక్​పై ఇంట్రెస్ట్​తో పాటు నా టార్గెట్స్​ కూడా పెరుగుతూ వచ్చాయి. దాంతో ఒక పక్క ఆన్​లైన్​లో డిజైనింగ్​ కోర్సులు వింటూనే.. మ్యూజిక్​పైనా శ్రద్ధ పెట్టా. ఫస్ట్​ రన్నరప్​గా నిలవడం అనేది లైఫ్​లో ఓ మెమరబుల్​ మూమెంట్ నాకు.  ఈ విషయంలో ఆడియెన్స్​కి, షో జడ్జిలకి, మెంటార్స్​కి ముఖ్యంగా మా అమ్మానాన్నలకి  థ్యాంక్స్​ చెప్పాలి. 

సరిగమపలో ఒక ఎపిసోడ్​కి మ్యూజిక్​ డైరెక్టర్​ గోపీ సుందర్​  గెస్ట్​గా వచ్చారు. సాధారణంగానే పేరున్న మ్యూజిక్​ డైరెక్టర్​​ ముందు పాడాలంటే  బెరుకు ఉంటుంది. అలాంటిది  ఆయన తన అప్​కమింగ్​ ప్రాజెక్ట్​ కోసం మాలో ఒకర్ని సెలక్ట్​ చేస్తారని తెలిశాక అందరిలోనూ టెన్షన్​ డబుల్​ అయింది. పోటాపోటీగా అందరం పర్ఫార్మెన్స్​ఇచ్చాం. ఆయన నా దగ్గరికొచ్చి నా చెయ్యి పట్టుకొని సెలక్ట్​ చేసిన మూమెంట్​ ఇప్పటికీ నా కళ్లముందే వుంది. ఆయన మాటిచ్చినట్టుగానే.. తను మ్యూజిక్​ చేస్తున్న ‘ తెలుసా.. మనసా..’ సినిమా టైటిల్​ ట్రాక్​ పాడించారు. అలాగే కొన్ని షార్ట్​ ఫిల్మ్స్​కి పనిచేస్తున్నా.  రెహ్మాన్​, మణిశర్మ, హ్యారిస్​​ జయరాజ్​ మ్యూజిక్​ చాలా యునిక్​గా ఉంటుంది. వాళ్ల మ్యూజిక్​ డైరెక్షన్​లో పాడే అవకాశం వస్తే చాలా హ్యాపీ. అలాగే ఫ్యూచర్​లో​ మ్యూజిక్​ డైరెక్టర్​గా కూడా  ట్రై చేయాలనుకుంటున్నా. వీలైనన్ని మంచి పాటలు పాడాలన్నదే నా గోల్​. 

::: ఆవుల యమున