దసరాకు జియో 5జీ ప్రారంభం

దసరాకు జియో 5జీ ప్రారంభం

జియో 5జీ సేవలు ఎప్పుడు ? అనే దానిపై క్లారిటీ వచ్చేసింది.  దసరా పండుగ రోజు (అక్టోబరు 5)  నుంచే జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతగా  ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, వారణాసి నగరాల ప్రజలు జియో 5జీ సేవలను ఆనందించొచ్చు.  తొలుత ఈ నగరాల్లో జియో ట్రూ 5జీ బీటా ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జియో వినియోగదారులకు ‘జియో ట్రూ 5జీ’ సేవలకు మారండి అంటూ ఒక వెల్కమ్ ఇన్విటేషన్ ను పంపించనున్నారు. దానిపై క్లిక్ చేసి సులభంగా  5జీ బీటా ట్రయల్స్ కు నెట్ వర్క్ ను అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. సిమ్ మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.

జియో 5జీ బీటా ట్రయల్ కు అంగీకరించే వినియోగదారులకు 1 జీబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను అందిస్తారు. అయితే 5జీ ఇంటర్నెట్ రావాలంటే.. వినియోగదారుల వద్ద 5జీ ని సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి.  5జీ బీటా ట్రయల్ లో భాగంగా  నెట్ వర్క్ కవరేజీ, ఇంటర్నెట్ స్పీడ్ వంటి అంశాలపై వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదుల ఆధారంగా  5జీ సేవల్లోని లోపాలను జియో తొలగించనుంది. జియోకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 42.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక ఎయిర్ టెల్ కంపెనీ అక్టోబరు 1నే 5జీ సేవలను 8 నగరాల్లో  ప్రారంభించింది. వొడాఫోన్ ఐడియా కూడా త్వరలోనే 5జీ సేవలకు శ్రీకారం చుట్టనుంది.