మన దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు కోట్లలో ఉన్నారు. అయితే.. ఇప్పటికీ ఫీచర్ ఫోన్లు వాడే వినియోగదారులు కూడా చాలా మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫీచర్ ఫోన్లు ఇప్పటికీ ఎక్కువగా వాడుతున్నారు. ఫీచర్ ఫోన్ల వినియోగదారులకు డిజిటల్ యాక్సెస్‌ను మరింత సులభతరం చేయడానికి ఐటెల్, రిలయన్స్ జియో జత కట్టాయి.
ఐటెల్ 4G ఫీచర్ ఫోన్ వినియోగదారులు జియో సిమ్ వేసుకుని నెలకు రూ. 123 ప్రీపెయిడ్ ప్లాన్ బెన్ఫిట్స్ పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 500 MB డేటా.. 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి. వాస్తవానికి.. ఫీచర్ ఫోన్స్ వాడుతున్న వినియోగదారులకు ఇది చాలా పనికొచ్చే అంశమే.
ఎందుకంటే.. నెలకు వందలకు వందలు మొబైల్ రీఛార్జ్ లకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నుంచి భారీ ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల్లో ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్లకు జియో, ఐటెల్ తీసుకొచ్చిన ఈ 123 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ శుభవార్తనే చెప్పాలి.
జియో ఇంతకుముందు ఈ ప్లాన్‌ను జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేసింది. కానీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఐటెల్ 4G ఫీచర్ ఫోన్ వినియోగదారుడు ఈ రూ.123 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు పొందొచ్చు. వినియోగదారులు సంవత్సరానికి సుమారు వెయ్యి రూపాయల వరకూ ఆదా చేసుకోవచ్చు.
