ఆగస్టులో జియో జోరు.. 32.4 లక్షల మంది కొత్త యూజర్లు

ఆగస్టులో జియో జోరు.. 32.4 లక్షల మంది కొత్త యూజర్లు

న్యూఢిల్లీ:  ఈ ఏడాది ఆగస్టు నెలలో రిలయన్స్​ జియో కొత్తగా 32.4 లక్షల మంది సబ్​స్క్రయిబర్లను సంపాదించుకోవడంతో మొత్తం సబ్​స్క్రయిబర్ల సంఖ్య 44.57 కోట్లకు పెరిగింది. ఇదే నెలలో భారతి ఎయిర్​టెల్​ 12.17 లక్షల మంది కొత్త సబ్​స్క్రయిబర్లను చేర్చుకున్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) డేటా వెల్లడించింది. మరో వైపు కష్టాలలో కొనసాగుతున్న వోడాఫోన్​ ఐడియా (వీ) మాత్రం ఆగస్టు నెలలో 49,782 మంది సబ్​స్క్రయిబర్లను పోగొట్టుకుంది. భారతీ ఎయిర్​ టెల్​ సబ్ స్క్రయిబర్ల సంఖ్య ఆగస్టు నెలలో 37.64 కోట్లకు పెరిగిందని, వోడాఫోన్​ ఐడియా సబ్​స్క్రయిబర్లు 22.82 కోట్లకు తగ్గిపోయారని కూడా ట్రాయ్ డేటా తెలిపింది. 

ట్రాయ్ ఈ డేటాను ప్రతి నెలా ప్రకటిస్తోంది. జులై నెలతో పోలిస్తే ఆగస్టులో కొత్త కస్టమర్ల సంఖ్య రిలయన్స్​ జియోకి తగ్గింది. జులై నెలలో ఈ కంపెనీ 39 లక్షల మంది కొత్త సబ్​స్క్రయిబర్లను తన ఖాతాలో వేసుకుంది. ఆగస్టు నెలలో 1.26 కోట్ల మంది  మొబైల్​ నెంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్​పీ) కోసం రిక్వెస్టులు పెట్టుకున్నారని, దీంతో ఎంఎన్​పీ కోసం వచ్చిన మొత్తం రిక్వెస్టులు 87.7 కోట్లకు (ఎంఎన్​పీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా) చేరాయని ట్రాయ్​ డేటా వివరించింది. బ్రాడ్​బ్యాండ్​లో  దేశంలోని టాప్​ అయిదు సర్వీస్​ ప్రొవైడర్లకూ కలిపి 98.35 శాతం మార్కెట్​వాటా ఉన్నట్లు తెలిపింది. రిలయన్స్ ​జియో, భారతి ఎయిర్​టెల్​, వీ, బీఎస్​ఎన్​ఎల్​ మొదటి 4 ప్లేస్​లలో ఉన్నాయని పేర్కొంది. ఆగస్టు చివరి నాటికి దేశంలోని వైర్​లెస్​ సబ్​స్క్రయిబర్ల సంఖ్య 114.8 కోట్లకు చేరినట్లు ట్రాయ్​ వెల్లడించింది.