V6 News

జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి జియో..అలియాంజ్ గ్రూప్తో జాయింట్ వెంచర్

జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి జియో..అలియాంజ్ గ్రూప్తో జాయింట్ వెంచర్

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అలియాంజ్ గ్రూప్ కలిసి 50:50 భాగస్వామ్యంతో భారతదేశ జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి అడుగుపెట్టేందుకు బుధవారం ఒప్పందం చేసుకున్నాయి. 2025 జూలైలో కుదిరిన ఈ ప్రాథమిక ఒప్పందాన్ని తాజాగా అధికారికం చేశారు. ఈ కొత్త జాయింట్ వెంచర్ ద్వారా వ్యక్తులు, వ్యాపార సంస్థలకు అత్యుత్తమ రక్షణ పరిష్కారాలను అందించనున్నారు. 

జియో సంస్థకు ఉన్న డిజిటల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్, పంపిణీ సామర్థ్యాన్ని అలియాంజ్ అంతర్జాతీయ బీమా నైపుణ్యంతో కలిపి సేవలు అందిస్తారు.  లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో కూడా కలిసి పనిచేయాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ సామాన్యులకు ఆర్థిక సేవలను చేరువ చేయడమే తమ ఆశయమని తెలిపారు. 

అలియాంజ్ గ్లోబల్ సీఈఓ ఒలివర్ బేట్ మాట్లాడుతూ భారతీయుల అవసరాలకు అనుగుణంగా కొత్త బీమా నమూనాను రూపొందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభించిన తర్వాత ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.