
- లిస్టింగ్ డేట్ ప్రకటించలేదు
న్యూఢిల్లీ: మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యే ముందు అర్హులైన షేర్‌హోల్డర్ల డీమాట్ అకౌంట్లలో జియో ఫైనాన్షియల్ (జేఎఫ్‌ఎస్‌ఎల్) షేర్లు క్రెడిట్ అయ్యాయి. కంపెనీ షేర్లు మార్కెట్‌లో ఎప్పుడు లిస్టింగ్ అవుతాయో ఇంకా డేట్ ప్రకటించలేదు. డీమాట్ అకౌంట్‌లో షేర్లు క్రెడిట్ అయినా, లిస్టింగ్ పూర్తయ్యాకనే వీటిని ట్రేడ్ చేసుకోవడానికి వీలుంటుంది. డీమెర్జర్‌లో భాగంగా కిందటి నెల 20 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కలిగిన ఇన్వెస్టర్లకు ఒక షేరుకి ఒక జియో ఫైనాన్షియల్ షేరును ఇష్యూ చేశారు.
నిఫ్టీ 50, బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్‌లో అదనపు స్టాక్‌గా జేఎఫ్‌ఎస్‌ఎల్ కొనసాగుతోంది. లిస్టింగ్ అయిన తర్వాత అంటే టీ+3 డేస్ తర్వాత ఈ కంపెనీ షేర్లు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల నుంచి ఎగ్జిట్ అవుతాయి. జియో ఫైనాన్షియల్ షేర్ల కోసం ప్రైస్ డిస్కవరీ సెషన్‌ను కిందటి నెల 20 న జరిపిన విషయం తెలిసిందే. షేరు ధర రూ.261.85 గా డిసైడ్ అయ్యింది. ఇది బ్రోకరేజ్ కంపెనీలు అంచనా వేసిన సగటు ధర రూ.190 కంటే చాలా ఎక్కువ. మరోవైపు రికార్డ్ డేట్ కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొన్న ఇన్వెస్టర్‌కు జియో ఫైనాన్షియల్ షేర్లు రూ.133 దగ్గరే దొరికాయి.
షేరు ధర రూ.261.85 దగ్గర జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ వాల్యూ రూ.1.66 లక్షల కోట్లుగా ఉంది. వాల్యూయేషన్ ప్రకారం దేశంలోని రెండో అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీగా ఎదిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ వివిధ రెగ్యులేటరీ రూల్స్‌కి లోబడి పని చేయాల్సి ఉంటుందని, ఇండిపెండెంట్ కంపెనీగా ఉండడంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుంటుందని కంపెనీ యాన్యువల్ రిపోర్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ ఫైనాన్స్‌సెక్టార్ రూపురేఖలను మార్చడంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా, మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు బ్లాక్‌రాక్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన విషయం తెలిసిందే.