
బిజినెస్ డెస్క్, వెలుగు: ఇప్పటికే ప్రీపెయిడ్ సెగ్మెంట్‌లో లీడర్‌గా కొనసాగుతున్న జియో, పోస్ట్‌పెయిడ్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచింది. ఎయిర్‌టెల్‌ను ఎదుర్కొనేందుకు పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లను లాంచ్ చేసింది. వీటి ధరలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీ) అందిస్తున్న ప్లాన్‌ల కంటే 40 శాతం తక్కువ కావడం విశేషం. అంతేకాకుండా అదనపు బెనిఫిట్స్‌ను కూడా జియో ఆఫర్ చేస్తోంది. డేటా షేరింగ్, ఫ్యామిలీ మొత్తానికి ఒకే బిల్లు ఇవ్వడం, కొన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీగా ఇవ్వడం వంటి బెనిఫిట్స్‌తో పోస్ట్‌పెయిడ్‌పై జియో దృష్టి పెట్టింది. ఇప్పటికే జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న కస్టమర్లు పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకుంటే ఒక నెల ఫ్రీ ట్రయల్ సర్వీస్ పొందొచ్చు. కొత్తగా తెచ్చిన పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్ రూ.399 నుంచి స్టార్టవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తూ రూ. 699 ప్లాన్‌ను కూడా జియో తీసుకొచ్చింది. వీటికి అదనంగా రూ.299 (ఇండివిడ్యువల్) ప్లాన్‌ను తెచ్చింది. ఇప్పటికే ఉన్న రూ.599 ప్లాన్‌కు కొన్ని మార్పులు చేసింది.
పోస్ట్ పెయిడ్ ఎందుకు?
43 కోట్ల కస్టమర్లతో టెలికం సెక్టార్‌లో జియో లీడర్‌గా కొనసాగుతోంది. అయినప్పటికీ వీరిలో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు 5 శాతం కంటే తక్కువే ఉన్నారు. అదే ఎయిర్‌టెల్‌కు ఉన్న 36 కోట్ల కస్టమర్లలో పోస్ట్‌పెయిడ్ యూజర్ల వాటా 5–6 శాతం దగ్గర ఉంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు ధరలను ఎక్కువగా పట్టించుకోరు. దీంతో ఎక్కువ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) పొందడానికి టెలికం కంపెనీలకు వీలుంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఎంటర్ అవ్వడానికి 2018, 2020 లో జియో ప్రయత్నాలు చేసింది. కానీ, పెద్దగా విస్తరించలేకపోయింది. తాజాగా ప్రత్యర్ధి కంపెనీల కంటే 40 శాతం తక్కువ ధరకే పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లను తీసుకొచ్చింది.
ఈ ప్లాన్‌లే..
బేస్ ధర రూ.399 నుంచే ఫ్యామిలీ ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ఎంచుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్‌ఎంఎస్ వస్తుంది. డేటా 75 జీబీ ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగా అదనపు సిమ్‌ను యాడ్ ఆన్ చేసుకుంటే 5జీబీ డేటా ఇస్తారు. రూ.99 చొప్పున చెల్లించి, మూడు సిమ్‌ల వరకు యాడ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.500 కట్టాల్సి ఉంటుంది. అదే రూ.699 ప్లాన్‌తో రూ.100 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఫ్రీ ట్రయల్ ఉంటుంది. రూ.99 చొప్పున చెల్లించి మూడు సిమ్‌ల వరకు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.875
చెల్లించాలి.
ఎయిర్‌టెల్‌కు దెబ్బ..
ఈ ప్రభావం ఎయిర్‌టెల్‌పై ఎక్కువగా పడనుంది. కంపెనీ సీఈఓ గోపాల్ విట్టల్ టారిఫ్‌లు పెంచాల్సిన అవసరం ఉందని గత కొంత కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. జియో రేట్లను తగ్గించి, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకురావడంతో ఇప్పట్లో టారిఫ్‌లు పెరిగే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా మార్కెట్‌లో జియోతో పోటీపడాలంటే ఎయిర్‌టెల్ కూడా తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల రేట్లను తగ్గించాల్సి వస్తుంది. ఇది కంపెనీ రెవెన్యూపై ప్రభావం చూపుతుంది. ఎయిర్‌టెల్ షేర్లు గత మూడు నెలల్లో 8 శాతం మేర పడగా, బుధవారం సెషన్‌లో 2.5 శాతం వరకు నష్టపోయాయి.