వచ్చే ఏడాది జియో ఐపీఓ

వచ్చే ఏడాది జియో ఐపీఓ

ముంబై: మనదేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌‌ అంబానీకి చెందిన టెలికం విభాగం రిలయన్స్‌‌ జియో వచ్చే ఏడాది ఐపీఓకు రానుందని సమాచారం. ఇందుకోసం జియో అధికారులు ఇది వరకే బ్యాంకర్లతో, కన్సల్టంట్లతో పలుసార్లు చర్చలు జరిపినట్టు తెలిసింది. 2020 జూన్‌‌ తరువాత ఐపీఓకు వెళ్లేందుకు జియో సిద్ధమవుతున్నదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఐపీఓ కంటే కంపెనీ టవర్‌‌, ఫైబర్‌‌ అసెట్స్‌‌ వ్యాపారాలు నిర్వహించే రెండు ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్స్ ట్రస్ట్స్‌‌ (ఐఎన్‌‌వీఐటీఎస్‌‌)కు ఇన్వెస్టర్లను వెతకడానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని జియో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 31 కోట్ల వరకు ఉన్న చందాదారుల సంఖ్యను మరింత పెంచుకోవడానికి జియో ప్రయత్నిస్తోంది. దీనికితోడు ఫైబర్‌‌ టు హోమ్‌‌ సేవలను త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఫలితంగా కంపెనీకి రాబడి మరింత పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఐపీఓ తేవాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన క్వార్టర్‌‌లో లాభాలను ప్రకటించిన ఏకైక ఇండియా టెల్కో..జియో. ఇది రూ.840 కోట్ల స్టాండ్‌‌ ఎలోన్‌‌ లాభం ప్రకటించింది. నికరలాభం 64.7 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రూ.2,964 కోట్ల నికరలాభం సంపాదించింది. మరో విశేషం ఏమిటంటే మార్చి క్వార్టర్‌‌లో జియో కొత్తగా 2.66 కోట్ల మంది చందాదారులను సంపాదించుకుంది.