
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) జియో ఇన్ఫోకామ్ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఫైనాన్షియల్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సేవలను కొత్త ఏడాదిలో ప్రారంభించేందుకు కంపెనీ ప్లాన్లు రెడీ చేస్తోంది. రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ జియో మనీ ద్వారా మ్యూచువల్ ఫండ్ సేవలను అందించనుంది. జియో మనీ ద్వారా నగదును పంపడానికి, తీసుకోవడానికి, డొనేట్ చేయడానికి వీలవుతుంది. వీటితో పాటు బిల్స్ పే చేయడం, మొబైల్ ఫోన్లను, డీటీహెచ్‌లను రీచార్జ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ సర్వీసులను ప్రారంభించడంపై గత కొన్ని నెలల నుంచి జియో ట్రయల్స్ నిర్వహిస్తోందని పరిశీలకులు తెలిపారు. దీనిపై రిలయన్స్ జియో మీడియా ప్రతినిధి స్పందించలేదు. గత కొన్ని క్వార్టర్ల నుంచి ఉద్యోగులకు ఈ సేవలను కంపెనీ అందిస్తోందని రిలయన్స్ జియో అధికారి ఒకరు తెలిపారు. దీని వలన ఈ సేవలను ప్రారంభించక ముందే లూప్ హోల్స్‌ను తెలుసుకోవడానికి, నెట్‌వర్క్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను టెస్ట్ చేయడానికి కంపెనీకి వీలవుతుందన్నారు. జియోతో అధికారికంగా ఎటువంటి చర్చలు జరగకపోయినప్పటికి, కంపెనీ ఆర్‌బీఐ నుంచి అకౌంట్ అగ్రిగేటర్(ఏఏ) లైసెన్సును జియో ఇన్ఫోకామ్ ద్వారా పొందిందని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. బ్యాంక్ అకౌంట్,క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వంటి వివరాలను కస్టమర్ల అంగీకారంతో సేకరించేందుకు ఏఏ అనుమతిస్తుంది. జియో మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్‌లో కి అడుగుపెడుతుండడం, ఈ రంగానికి లాభిస్తుందని విశ్లేషకులు తెలిపారు.