ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ హోల్డింగ్ కంపెనీ జియో ప్లాట్‌ఫార్మ్స్ మెగా ఐపీఓ ప్రారంభానికి సిద్ధమవుతోంది. దాదాపు రూ.37 వేల కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూ ఈనెల 21–23 తేదీల్లో సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్‌లో ఉంటుంది. యాంకర్ బుక్ 19న తెరుచుకోనుంది. అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజీలలో షేర్లు లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సెబీ నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఇప్పటికే లభించాయి.
దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులలో సుమారు రూ.27,500 కోట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అప్పుల చెల్లింపులకు ఉపయోగించనున్నారు.
మిగిలిన మొత్తాన్ని ఇతర కార్పొరేట్ అవసరాలకు కేటాయిస్తారు. 50 శాతం షేర్లను రిటైల్, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లకు కేటాయించారు. రిటైల్ విభాగానికి 35 శాతం రిజర్వ్ చేశారు. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి నాటికి జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 52.44 కోట్లకు చేరింది.
