మెమోలో ఫొటో సరిచేసేందుకు  రూ.10 వేలు

మెమోలో ఫొటో సరిచేసేందుకు  రూ.10 వేలు
  • వర్సిటీ, కాలేజీల తప్పులు.. స్టూడెంట్లకు తిప్పలు
  • జేఎన్టీయూహెచ్ స్టూడెంట్ల మెమోల్లో మిస్టేక్స్ 
  • ఫొటో సరిచేసేందుకు  రూ.10 వేలు వసూలు  

హైదరాబాద్, వెలుగు:  జేఎన్టీయూహెచ్ అధికారులు, కాలేజీ మేనేజ్మెంట్ల తప్పుల వల్ల.. స్టూడెంట్లు తిప్పలు పడుతున్నరు. హాల్​టికెట్లలో తప్పులు వచ్చినా పట్టించుకోకపోవడంతో, చివరికి మెమోలు కూడా అలాగే మిస్టేక్స్ తో వస్తున్నయి. అయితే మెమోల్లో తప్పులను సరిచేసుకునేందుకు వర్సిటీ అధికారులు పెనాల్టీ రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. బీటెక్ నాలుగేండ్ల కాలంలో 8 సెమిస్టర్లు జరుగుతాయి. ఎగ్జామ్ ఫీజు వివరాలను ఇంజినీరింగ్ కాలేజీలే ఏటా వర్సిటీకి పంపిస్తాయి. ఈ ప్రాసెస్​లో ఫీజులు చెల్లించడం తప్ప, స్టూడెంట్లకు ఇన్వాల్వ్ మెంట్ ఏమీ ఉండదు. ఈ క్రమంలో స్టూడెంట్ల హాల్​టికెట్లలో ఏ చిన్నతప్పు ఉన్నా, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ దే. పేర్లలో తప్పులు వచ్చినా, ఫొటోలు సరిగా రాకపోయినా, సబ్జెక్టులు మారినా వెంటనే స్టూడెంట్లు కాలేజీ అధికారుల దృష్టికి తీసుకుపోతుంటారు. కొన్ని మేనేజ్మెంట్లు వర్సిటీ అధికారులతో మాట్లాడి సరిచేస్తుండగా, కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మేనేజ్మెంట్ల నిర్లక్ష్యం, వర్సిటీ అధికారుల అలసత్వంతో హాల్​టికెట్లలోని తప్పులే మెమోల్లోనూ వస్తున్నాయి. ఈ తప్పంతా స్టూడెంట్లదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 
 

కాలేజీల నిర్లక్ష్యం 
ఓ స్టూడెంట్ మెమో, ప్రొవిజనల్ మెమోలో ఫొటో సరిగా రాలేదు. వర్సిటీ పరీక్షల విభాగం దృష్టికి తీసుకుపోగా, రూ.10 వేలు చెల్లిస్తే కొత్తవి ఇస్తామని చెప్పారు. తమకు సంబంధం లేకుండా తప్పులు వస్తే తామెందుకు డబ్బులు కట్టాలని ఆ స్టూడెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తమ తప్పేమీ లేదని జేఎన్టీయూహెచ్ ఎగ్జామ్స్ బ్రాంచ్ డైరెక్టర్ కామాక్షి తెలిపారు. మెమోల్లో తప్పులొస్తే మేనేజ్మెంట్లదే బాధ్యతని అన్నారు.  ఫొటోలో తప్పులొస్తే డబ్బులు కట్టాల్సిందేనన్నారు.