- కీలక నిర్ణయం తీసుకున్న జేఎన్టీయూహెచ్
- రీసెర్చ్ సెంటర్లు ఉన్న కాలేజీలకే చాన్స్.. ఈ వారంలోనే నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: రీసెర్చ్ విభాగంలో కీలక మార్పులకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం సర్కారు ప్రొఫెసర్లకు మాత్రమే పరిమితమైన యూనివర్సిటీ పీహెచ్‌డీ గైడ్ షిప్ అవకాశాన్ని.. ఈ ఏడాది నుంచి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని సీనియర్ ప్రొఫెసర్లకు కూడా కల్పించాలని నిర్ణయించింది. దీంతో వివిధ సబ్జెక్టుల్లో పరిశోధనలు పెరగడంతో పాటు ఎక్కువ మంది అభ్యర్థులకు పీహెచ్‌డీ చేసే అవకాశం దక్కుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను ఈ వారంలోనే రిలీజ్ చేసేందుకు జేఎన్‌టీయూ సిద్ధమైంది. అయితే, వర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలకూ ఈ గైడ్ షిప్ అవకాశం ఇవ్వడం లేదు. ఏ కాలేజీల్లో అయితే పీహెచ్‌డీ పరిశోధనలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రీసెర్చ్ అండ్ డెవలప్ సెంటర్ సెల్ ఉన్నాయో వాటిని మాత్రమే జేఎన్‌టీయూ గుర్తించింది. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో దాదాపు 88 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు రీసెర్చ్ సెంటర్లుగా అర్హత ఉన్నట్లు తేల్చింది.
ఈ కాలేజీల్లో పనిచేసే అర్హులైన సీనియర్ ప్రొఫెసర్లు ఇకపై పీహెచ్‌డీ స్కాలర్లకు గైడ్‌లుగా వ్యవహరించవచ్చు. ప్రైవేటు కాలేజీల ప్రొఫెసర్లకు గైడ్ షిప్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో వర్సిటీ కొన్ని నిబంధనలు విధించింది. ప్రారంభంలో ఒక్కో ప్రొఫెసర్‌కు ఒక స్కాలర్‌ను మాత్రమే కేటాయించనున్నారు. రీసెర్చ్ నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రీసెర్చ్ అవుట్‌పుట్, పనితీరును బట్టి స్కాలర్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నారు. ఇక వారం రోజుల్లో విడుదలయ్యే పీహెచ్‌డీ నోటిఫికేషన్‌లో సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
