ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా..ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు

ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా..ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు
  • తీవ్ర స్థాయికి చేరిన యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా
  • 8 రకాల స్టెఫిలోకాకస్ సూపర్‌‌‌‌‌‌‌‌బగ్స్‌‌‌‌‌‌‌‌ను రక్తంలోకి తీసుకెళ్తున్న పీఎం2.5 కణాలు
  • న్యుమోనియా,-సెప్సిస్, చర్మ వ్యాధులు విపరీతంగా పెరిగే ప్రమాదం
  • జవహర్‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ వర్సిటీ స్టడీ వెల్లడి

న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది.. దీనికి ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా తోడయిందన జేఎన్​యూ అధ్యయనంలో బయటపడింది. మందులకు లొంగని బ్యాక్టీరియా ఒకటి గాలిలో ప్రమాదకర స్థాయిలో పెరిగిందని తేలింది. ముఖ్యంగా స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు తేలింది. వీటిలో 73% ఒక మందుకు లొంగనివి కాగా, 36% బ్యాక్టీరియా మాత్రం ఎక్కువ మందులను సైతం తట్టుకునేలా మారాయని స్పష్టమైంది. 

డబ్ల్యూహెచ్‌‌ఓ పరిమితులకు మించి..

జేఎన్‌‌యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌‌మెంటల్ సైన్సెస్‌‌కు చెందిన పరిశోధకులు నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. వీరు ఢిల్లీలోని వసంత్ విహార్ స్లమ్, మునిర్కా మార్కెట్, అపార్ట్‌‌మెంట్లు, జేఎన్‌‌యూ సెవేజ్ ట్రీట్‌‌మెంట్ ప్లాంట్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఇండోర్, అవుట్‌‌డోర్ గాలి నమూనాలు సేకరించారు. వాటిని బాగా స్టడీ చేశారు. 

ఈ స్టడీ రిపోర్ట్ ప్రకారం..ఫలితాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఢిల్లీ గాలిలో ఎనిమిది రకాల స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. అందులోనూ మానవులకు హాని కలిగించే స్టెఫిలోకాకస్ ఎపిడెర్మిడిస్ ఎక్కువగా ఉంది. ఢిల్లీ గాలిలో (ఇండోర్, అవుట్‌‌డోర్ రెండింటిలోనూ) స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 

ఈ బ్యాక్టీరియా లోడ్ క్యూబిక్ మీటర్‌‌కు 16 వేల సీఎఫ్ యూ(కాలనీ ఫార్మింగ్ యూనిట్స్)కు పైగా నమోదైంది. ఇది డబ్ల్యూహెచ్‌‌ఓ సిఫారసు చేసిన సురక్షిత పరిమితి అయిన క్యూబిక్ మీటర్‌‌కు వెయ్యి సీఎఫ్ యూ కంటే చాలా ఎక్కువ.

పీఎం2.5 కణాలే వాహకాలుగా..

ఢిల్లీ గాలిలోని పీఎం2.5 కణాలే ఈ స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాను మోసుకెళ్తున్నాయి. మానవ వెంట్రుకల కంటే 30 రెట్లు చిన్నగా ఉండే ఈ కణాలు  ఊపిరితిత్తులలోకి, అక్కడి నుంచి రక్తంలోకి ప్రవేశించగలవు. డబ్ల్యూహెచ్‌‌ఓ ప్రకారం.. పీఎం2.5 సగటు స్థాయి 24 గంటల సగటుకు సురక్షిత పరిమితిని 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ గా సిఫార్సు చేసింది. 

దేశంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) దీనినే 24 గంటల సగటుకు సురక్షిత పరిమితిని 60 గా  నిర్దేశించింది. కానీ,  డిసెంబర్ 2025లో ఢిల్లీలో పీఎం2.5 సగటు స్థాయి క్యూబిక్ మీటర్‌‌కు 211 మైక్రోగ్రాములుగా నమోదైంది.  ఢిల్లీలో పెరుగుతున్న  అధిక కాలుష్యం.. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాప్తికి అనుకూల వాతావరణమైంది.

 ఈ బ్యాక్టీరియా చర్మ, న్యుమోనియా, సెప్సిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. కాగా, దుమ్ము కణాలే పీఎం2.5కి ప్రధాన కారణమని ఢిల్లీ మున్సిపల్ అధికారులు గుర్తించారు. దుమ్ము నియంత్రణకు చర్యలు చేపట్టారు.