
కరీంనగర్: ఉద్యోగం రాలేదని తెలంగాణలో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి మొహ్మద్ షబ్బీర్ (26) అనే యువకుడు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం సిరివేడు గ్రామానికి చెందిన ఆ యువకుడు డిగ్రీ, ఐటీఐ చదివినా ఎలాంటి ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం 8.55 సమయంలో ఈ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. షబ్బీర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో ఉందని పోలీసులు వెల్లడించారు.