ఓయూలో దొడ్డిదారిన కొలువుల భర్తీ

ఓయూలో దొడ్డిదారిన కొలువుల భర్తీ

వందేండ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో దొడ్డిదారిన ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఎన్నో త్యాగాలు, బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమ ఆశయాలను తుంగలో తొక్కి దొడ్డిదారిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2న ప్రభుత్వ అనుమతి లేకుండా వర్సిటీల్లో ఎలాంటి నియామకాలను చేపట్టరాదని జీవో జారీ చేశారు. కానీ, ఓయూలో ఖాళీగా ఉన్న 15 అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులను ప్రభుత్వం కళ్లుగప్పి, ఎలాంటి నిబంధనలు పాటించకుండా భర్తీ చేస్తున్నారు. 1993లో ఓపెన్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేశారు. 2012లో ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేసినప్పుడు అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపి ఓపెన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. 2018లో జరిగిన ఈసీ మీటింగ్​లో అసిస్టెంట్ లైబ్రేరియన్​ పోస్టులను ఓపెన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే 2021లో ప్రస్తుత వీసీ తూతూ మంత్రంగా ఈసీ మీటింగ్ పెట్టి, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులను ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో లైబ్రరీ సైన్స్ పూర్తి చేసిన 7,500 మంది ఉన్నారు. వీరందరినీ విస్మరించి దొడ్డిదారిన ఉద్యోగాల భర్తీ చేయడాన్ని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అసిస్టెంట్​ లైబ్రేరియన్​ పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డుకోవాలి. 
- జీవన్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ