
వికారాబాద్, వెలుగు: జీవో నంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలని, గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో ప్రాధాన్యం కల్పించాలని వీఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏల వారసులు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ఎదుట నిరసన తెలిపి, కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతిపత్రం అందజేశారు.
16,758 మంది వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారని, మిగతా 3,797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో వారసులకు ఉద్యోగం ఇచ్చి, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కలెక్టర్హామీ ఇచ్చారన్నారు.
జేఏసీ ధారుర్ మండల అధ్యక్షుడు సంగమేశ్, మర్పల్లి అధ్యక్షుడు సంగమేశ్వర్, వికారాబాద్ మండల అధ్యక్షుడు బండకింది శ్రీనివాస్, యాలాల మండల అధ్యక్షుడు నర్సింహులు, పెద్దేముల్ మండల అధ్యక్షుడు జనార్ధన్ తదితరులున్నారు.