జాబ్స్ స్పెషల్ : బ్రిటిష్​ సామ్రాజ్య వ్యాప్తి

జాబ్స్ స్పెషల్ : బ్రిటిష్​ సామ్రాజ్య వ్యాప్తి
  • 1579లో థామస్​ స్టీవెన్స్​ అనే బ్రిటిష్​ జాతీయుడు భారత్​కు వచ్చి సాల్సెట్టిలో క్రైస్తవ మత ప్రచారకుడిగా పనిచేశాడు. ఈయన తన తండ్రికి రాసిన అనేక ఉత్తరాల్లో భారతదేశ స్థితిగతులను వివరిస్తూ ఆసక్తికరంగా తెలిపాడు. 
  • 1587లో రాల్ష్​ పిచ్​, జేమ్స్​ న్యూబెర్రీ, విలియం లీడ్స్​ అనే ముగ్గురు బ్రిటిష్​ వ్యాపారులు భూమార్గంగా భారత్​ను సందర్శించారు. వారు తమ రచనల్లో భారతదేశంలో చూసిన విషయాలను వివరించారు. 
  • 1587లో ఒక పెద్ద పోర్చుగీసు నౌకను బ్రిటిష్​ నౌకాదళాధికారైన ఫ్రాన్సిస్​ డ్రేక్​ పట్టుకున్నారు. భారత్​ నుంచి వస్తున్న ఆ నౌకలోని వస్తువుల విలువ లక్ష పౌండ్లు. 
  • 1599లో డచ్​వారు ఇంగ్లండ్​ మార్కెట్లలో మిరియాల ధరను మూడింతలు పెంచారు. నల్లబంగారంగా ఇంగ్లండ్​లో పేరొందిన మిరియాలను తక్కువ ధరకు పొందడం కోసం భారత్​తో సరాసరి వర్తక సంబంధాలను స్థాపనకు బ్రిటిష్​ వారు నిర్ణయించారు. 
  • 1600 డిసెంబర్​ 31న అప్పటి బ్రిటిష్​ రాణి ఎలిజబెత్​ అనుమతితో బ్రిటిష్​ ఈస్టిండియా కంపెనీని స్థాపించారు. ఇది పూర్తిగా ప్రైవేట్​ సంస్థ. కంపెనీ పరిపాలనను గమనించడం కోసం గవర్నర్​ ఉండేవాడు. 
  • 1600 నుంచి 1612 వరకు ప్రత్యేక నౌకాయానాలు కొనసాగాయి. ఒక్కో నౌకాయానం ముగిసిన తర్వాత లాభాలను వాటాదారులు పంచుకునేవారు. 
  • మొదట్లో బ్రిటిష్​ వారు భారతదేశంపై ఎక్కువ శ్రద్ధ చూపలేదు. మలయా ద్వీపకల్పంపై ఆసక్తి కనబర్చారు. కానీ 1623లో అంబోయానా మారణకాండ తర్వాత బ్రిటిష్​ వారు ఆ ప్రాంతంలో కొనసాగడానికి భయపడి భారత్​పై దృష్టిని మళ్లించారు.  
  • ఈస్ట్​ ఇండియా కంపెనీ 1612లో ఢిల్లీ చక్రవర్తి జహంగీర్​ వద్దకు బ్రిటిష్​ నౌకాదళాధికారైన హాకిన్స్​ను పంపించింది. కానీ ఈ రాయబారం విఫలమైంది. అప్పటికే ఢిల్లీలోని మొగల్​ దర్బార్​లో పోర్చుగీసు వారు పలుకుబడి కలిగి ఉండటం ఇందుకు కారణం. 
  • ఇంగ్లండ్​ రాజు ఒకటో జేమ్స్​ తరఫున సర్​ థామస్​ రో 1615లో ఢిల్లీ చక్రవర్తిని కలిశాడు. అప్పటికి పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గడంతో  థామస్​ రో కోరిక మేరకు సూరత్​ రేవును బ్రిటిష్​ వారికిచ్చి పన్నులు లేకుండా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చాడు. 
  • భారత్​లో బ్రిటిష్​  వారు పొందిన మొదటి వర్తక స్థావరం సూరత్​. 1622లో సూరత్​లోని బ్రిటిష్​ వారు పోర్చుగీసు వారి ఆధీనంలోని ఆర్మజ్​ను ఆక్రమించారు. 
  • గోల్కొండ​ నవాబు అనుమతితో బ్రిటిష్​ వారు తూర్పుకోస్తాలో మచిలీపట్నం వద్ద  1613లో ఒక వర్తక స్థావరం స్థాపించారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా 18వ శతాబ్దంలో మచిలీపట్నం బ్రిటిష్​ వారి ప్రధాన రేవుగా తయారైంది. 
  • మచిలీపట్నం కౌన్సిల్​ సభ్యుడు ఫ్రాన్సిస్​ డే.. ప్రస్తుత మద్రాస్​ నగరం గల ప్రాంతాన్ని ఎంపిక చేసి చంద్రగిరి రాజు నుంచి 1639లో కొనుగోలు చేశారు. ఇక్కడ నిర్మించిన కోట సెయింట్​ జార్జి.
  • 1652లో మద్రాస్​ను రాష్ట్రస్థాయికి అభివృద్ధి చేశారు. ఇక్కడి బ్రిటిష్​ స్థావరం మున్సిపల్​ కార్పొరేషన్​ స్థాయికి పెంచిన తర్వాత మద్రాస్​ వేగంగా అభివృద్ధి చెందింది.
  • తూర్పు ప్రాంతంలో బ్రిటిష్​ వారికి 1633 నుంచి బాలసోర్​, హరిహరపూర్​ అనే రెండు చిన్న వ్యాపార కేంద్రాలు ఉండేవి. 1651లో హుగ్లీలో మరో స్థావరం ప్రారంభించారు. 
  • బ్రిటిష్​ వైద్యుడు గాబ్రియల్​ బౌటన్​కు మొగల్​ చక్రవర్తి ఔరంగజేబ్ బహుమానంగా ​ హుగ్లీ నదీ తీరంలో కొంత భూమిని ఇచ్చారు. ఈ భూమిని ఈస్ట్​ ఇండియా కంపెనీ కొనుగోలు చేసి కలకత్తా నగరాన్ని నిర్మించింది. 
  • 1687లో కలకత్తా నగర నిర్మాణ పథకాలను ఔబ్​ ఛార్నక్​ పూర్తి చేశాడు. ఇక్కడ పోర్ట్​ విలయం అనే కోటను నిర్మించారు. 
  • పోర్ట్​ విలియం కోటకు చేరువలోని సుతానుతి, గోవిందపూర్​, కలికట అనే మూడు గ్రామాలనూ ఈస్ట్​ ఇండియా కంపెనీ కొనుగోలు చేసి కలకత్తా నగరంగా అభివృద్ధి చేసింది. 
  • కలికట గ్రామం వల్ల ఆ నగరానికి కలకత్తా అని పేరు వచ్చింది. కలకత్తాతోపాటు ఫల్టా, ఖాసీంబజార్​ కూడా బ్రిటిష్​ వారి ప్రసిద్ధ తొలి వ్యాపార కేంద్రాలు.
  • సూరత్​ రేవులో బ్రిటిష్​ వారు మహారాష్ట్రుల దండయాత్రలకు గురవుతూ వచ్చారు. అక్కడి నుంచి సురక్షిత స్థావరానికి వెళ్లాలనే ఆలోచన కలిగింది.  ప్రస్తుత బొంబాయి దీవిని 1667లో ఇంగ్లండ్ రాజైన రెండో చార్లెస్​ నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీ కౌలుకు తీసుకుంది.