అమెరికాలో కొవిడ్ కథ ముగిసిందన్న జో బైడెన్

అమెరికాలో కొవిడ్ కథ ముగిసిందన్న జో బైడెన్

అమెరికాలో కరోనా ముగిసిపోయిందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికాలో కొవిడ్ సృష్టించిన విజృంభణ అంతా ఇంతా కాదు. రోజుకు లక్షల్లో కేసులు నమోదైనా.. రోజురోజుకీ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా ఎలాంటి భయాలకూ పోకుండా బైడెన్ సమర్థంగా పరిస్థితిని ఎదుర్కున్నారు. ప్రస్తుతం కొన్ని స‌మ‌స్యలు ఉన్నా.. ప‌రిస్థితి మాత్రం మెరుగవుతోంద‌ని ఆయ‌న అన్నారు. అయితే ప్రస్తుతం ప్రతి రోజు అమెరికాలో కొవిడ్ వ‌ల్ల స‌గ‌టున 400 మంది మ‌ర‌ణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి చివ‌రి ద‌శ‌కు చేరుకున్నట్లు ఇటీవ‌ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో జో బైడెన్ మాట్లాడుతూ.. వైర‌స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంద‌ని తెలిపారు. ప్రస్తుతం తమ దేశంలో ప్రజ‌లెవ్వరూ మాస్క్‌లు ధ‌రించ‌డం లేద‌ని చెప్పారు. పరిస్థితి కంట్రోల్ లోనే ఉందన్న ఆయన.. ఇంకా మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా అమెరికాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల సుమారు 10 ల‌క్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.