సెంచరీతో చెలరేగిన రూట్..విండీస్ పై గ్రాండ్ విక్టరీ

సెంచరీతో చెలరేగిన రూట్..విండీస్ పై గ్రాండ్ విక్టరీ

సౌతాంప్టన్​: వరల్డ్​కప్​లో ఇంగ్లండ్​కు మరో విజయం. నిలకడకు, నైపుణ్యానికి మారుపేరైన జో రూట్ సెంచరీతో చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్​లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్​పై గెలిచింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన విండీస్​ 44.4 ఓవర్లలో 212 రన్స్​కు ఆలౌటైంది. పూరన్​ (78 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్​తో 63) రాణించగా, గేల్​ (41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్​తో 36), హెట్​మయర్​ (48 బంతుల్లో 4 ఫోర్లతో 39) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత ఇంగ్లండ్​33.1 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. సెంచరీతో పాటు రెండు వికెట్లు తీసిన రూట్​కు ‘మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​’ అవార్డు లభించింది.

రూట్​.. నీటుగా

టార్గెట్​ చిన్నదే కావడంతో ఇంగ్లండ్​కు ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదు. దీనికితోడు విండీస్​ బౌలింగ్​లో పదును లేకపోవడం కూడా కలిసొచ్చింది. ఆరంభం నుంచే బెయిర్​స్టో (46 బంతుల్లో 7 ఫోర్లతో 45) దూకుడుగా ఆడినా.. రూట్​ మాత్రం కుదురుకోవడానికి టైం తీసుకున్నాడు. సహచరుడికి ఎక్కువగా స్ర్టయికింగ్​ ఇస్తూ ఇన్నింగ్స్​ను సాఫీగా ముందుకు తీసుకెళ్లాడు. తొలి స్పెల్​లో కొట్రెల్​, థామస్​ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పవర్​ప్లేలో ఇంగ్లండ్​ 62 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని 15వ ఓవర్​లో గాబ్రియెల్​ (2/49) విడదీశాడు. ఓ షార్ట్​ బంతితో బెయిర్​స్టోను ఔట్​ చేయడంతో తొలి వికెట్​కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఫించ్​ హిట్టర్​గా వచ్చిన వోక్స్​ (54 బంతుల్లో 4 ఫోర్లతో 40) కూడా బాగా హిట్టయ్యాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ.. వికెట్ల మధ్య కూడా వేగంగా పరుగెత్తాడు. మధ్యలో స్పిన్నర్లను ప్రయోగించినా.. పరుగులు ఆగలేదు.. అలాగని వికెట్లూ పడలేదు. 50 బాల్స్​లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రూట్​తో కలిసి రెండో వికెట్​కు 104 పరుగులు జత చేసి వోక్స్​ ఔటయ్యాడు. అప్పటికే ఇంగ్లండ్​ విజయం ఖాయం కావడంతో.. రూట్​ మరింత నెమ్మదిగా ఆడాడు.  అదే క్రమంలో 93 బంతుల్లో ఈ వరల్డ్​కప్​లో రెండో సెంచరీని నమోదు చేశాడు. ఈ దశలో వచ్చిన స్టోక్స్​(10 నాటౌట్​) కూడా సమయోచితంగా ఆడటంతో మరో 101 బంతులు మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టు గెలుపును అందుకుంది.

పేస్​ దెబ్బకు కుదేల్​.. 

అంతకుముందు బౌన్సీ ట్రాక్​పై ఇంగ్లిష్​ పేసర్లు నిప్పులు చెరగడంతో విండీస్​ పెద్ద తలకాయలన్నీ తక్కువ స్కోరుకే వెనుదిరిగాయి. పూరన్​ఒక్కడే యాంకర్​ ఇన్నింగ్స్​తో హాఫ్​ సెంచరీ చేసినా.. గేల్​తో సహా అందరూ విఫలమయ్యారు. యంగ్​ పేసర్​ ఆర్చర్​ (3/30), వుడ్​ (3/18), వోక్స్​ (1/16), ఫ్లంకెట్​ (1/30) వరుస క్రమాల్లో వికెట్లు తీయడంతో విండీస్​ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 4 రన్స్​కే లూయిస్​ (2) ఔట్​కావడంతో మొదలైన కరీబియన్ల కష్టాలు చివరి వరకు కొనసాగాయి. ఓపికగా ఆడాల్సిన పరిస్థితుల్లో గేల్, హోప్​ (11) అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. 3 బంతుల తేడాలో ఈ ఇద్దరు ఔట్​కావడంతో విండీస్​ 55/3 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో పూరన్​, హెట్​మయర్​ ఆచితూచి ఆడుతూ ఇంగ్లండ్​ బౌలింగ్​ను సమర్థంగా ఎదుర్కొన్నారు. భారీ షాట్లకు పోకుండా స్ర్టయిక్​ రొటేట్​చేస్తూ వికెట్లను కాపాడుకున్నారు. ఈ క్రమంలో నాలుగో వికెట్​కు 89 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించడంతో కరీబియన్​ జట్టు స్కోరు 200లైనా దాటింది. 30వ ఓవర్​లో బౌలింగ్​కు వచ్చిన రూట్..  డబుల్​ షాకిచ్చాడు. కేవలం 7 బంతుల తేడాతో హెట్​మయర్​, హోల్డర్​(9)ను పెవిలియన్​కు పంపాడు.  భారీ ఆశలు పెట్టుకున్న బిగ్​ హిట్టర్​రసెల్​ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. రషీద్​ బౌలింగ్​లో రెండు టవరింగ్​ సిక్సర్లు బాది జోరు పెంచాడు. అదే జోష్​లో వుడ్​ బంతిని గాల్లోకి లేపి 37వ ఓవర్​లో వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 188/6. పూరన్​ 56 బంతుల్లో ఫిఫ్టీ మార్క్​ను సాధించడంతో.. విండీస్​ స్కోరు 200 దాటింది. భారీ స్కోరుపై కన్నేసిన విండీను ఆర్చర్​ రెండో దెబ్బతీశాడు. 40వ ఓవర్​లో వరుస బాల్స్​లో పూరన్​, కొట్రెల్​(0)ను, కొద్దిసేపటికే బ్రాత్​వైట్​(14)ను వెనక్కి పంపి స్కోరు బోర్డుకు అడ్డుకట్ట వేశాడు.

మోర్గాన్​, రాయ్​​కు గాయం!

మ్యాచ్​ సందర్భంగా ఫీల్డింగ్​ చేస్తూ ఇంగ్లండ్​ కెప్టెన్​ మోర్గాన్​ గాయపడ్డాడు. బ్యాట్స్​మన్​ను రనౌట్​చేసే ప్రయత్నంలో బంతిని నాన్​స్ట్రయిక్​ ఎండ్​కు విసిరే క్రమంలో జారిపడ్డాడు. దీంతో వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డ మోర్గాన్ ​పెవిలియన్​కు వెళ్లిపోయాడు. ఓపెనర్​ జేసన్​ తొడ కండర గాయంతో బాధపడుతున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే గాయానికి గురికావడంతో అతను కూడా డ్రెస్సింగ్​ రూమ్​కు వెళ్లిపోయాడు.

వెస్టిండీస్​: గేల్​ (సి) బెయిర్​స్టో (బి) ఫ్లంకెట్​ 36, లూయిస్​ (బి) వోక్స్​ 2, హోప్​ ఎల్బీ (బి) వుడ్​ 11, పూరన్​ (సి) బట్లర్​ (బి) ఆర్చర్​ 63, హెట్​మయర్​ (సి అండ్​ బి) రూట్​ 39, హోల్డర్​ (సి అండ్​ బి) రూట్​ 9, రసెల్​ (సి) వోక్స్​ (బి) వుడ్​ 21, బ్రాత్​వైట్​(సి) బట్లర్​(బి) ఆర్చర్​14, కొట్రెల్​ఎల్బీ (బి) ఆర్చర్​ 0, థామస్​ (నాటౌట్​) 0, గాబ్రియెల్​ (బి) వుడ్​ 0, ఎక్స్​ట్రాలు: 17, మొత్తం: 44.4 ఓవర్లలో 212 ఆలౌట్​.  వికెట్లపతనం: 1–4, 2–54, 3–55, 4–144, 5–156, 6–188, 7–202, 8–202, 9–211, 10–212. బౌలింగ్​: వోక్స్​ 5–2–16–1, ఆర్చర్​ 9–1–30–3, ఫ్లంకెట్​ 5–0–30–1, వుడ్​ 6.4–0–18–3, స్టోక్స్​ 4–0–25–0, రషీద్​ 10–0–61–0, రూట్​ 5–0–27–2.

ఇంగ్లండ్​: బెయిర్​స్టో (సి) బ్రాత్​వైట్​(బి) గాబ్రియెల్​ 45, రూట్​ (నాటౌట్​) 100, వోక్స్​(సి) (సబ్) అల్లెన్​ (బి) గాబ్రియెల్​ 40, స్టోక్స్​(నాటౌట్) 10, ఎక్స్​ట్రాలు: 18, మొత్తం: 33.1 ఓవర్లలో 213/2.

వికెట్లపతనం: 1–95, 2–199. బౌలింగ్​: కొట్రెల్​3–0–17–0, థామస్​6–0–43–0, గాబ్రియెల్​ 7–0–49–2, రసెల్​2–0–14–0, హోల్డర్​5.1–0–31–0, బ్రాత్​వైట్​5–0–35–0, గేల్​5–0–22–0.