కవిత అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు .. బీజేపీ కక్ష సాధిస్తోంది : జోగు రామన్న

కవిత అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు .. బీజేపీ కక్ష సాధిస్తోంది : జోగు రామన్న

ఆదిలాబాద్​టౌన్/బెల్లంపల్లి కోల్​బెల్ట్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్​ నేతలపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ఆదిలాబాద్​పట్టణంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కలెక్టరేట్ చౌక్​వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్, రమేశ్, ప్రహ్లాద్, తదితర నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లిలో బీఆర్​ఎస్​ నేతలు నల్ల గుడ్డలు పట్టుకొని నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు సిద్ధంశెట్టి సాజన్, బీఆర్ఎస్ లీడర్లు సత్యనారాయణ, బానయ్య, సుందర్ రావు, అనీఫ్, సాజిద్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి నేషనల్​ హైవేపై, మందమర్రి మార్కెట్​వద్ద గల కోల్​బెల్ట్ ​రహదారిపై బీఆర్​ఎస్​ లీడర్లు, కార్యకర్తలు వేర్వేరుగా రాస్తారోకోలు చేపట్టి నిరసన తెలిపారు. కేంద్రం కుట్రపూరితంగా కవితను అరెస్ట్ చేయించిందని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. క్యాతనపల్లి మున్సిపల్​ఇన్​చార్జి గాండ్ల సమ్మయ్య, డాక్టర్​ రాజారమేశ్, మున్సిపల్ ​కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు.