రైతుబంధు స్వాహాలో..అసలు సూత్రధారులెవరు?

రైతుబంధు స్వాహాలో..అసలు సూత్రధారులెవరు?
  •     రూ.40 లక్షలు మిస్ యూస్  అయినట్లు గుర్తింపు
  •     ఏఈవో సస్పెన్షన్ తో సరిపెట్టిన ఆఫీసర్లు

గద్వాల,వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో రైతుబంధు స్కాం వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నా ఎంక్వైరీ ముందుకెళ్లడం లేదు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులను తప్పించేందుకు ఏఈవోపై సస్పెన్షన్​ వేటు వేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక లీడర్ తో పాటు ముగ్గురు మీసేవా నిర్వాహకులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాధిత రైతు కంప్లైంట్ తో ఏఈవోను ప్రశ్నించగా, తప్పు ఒప్పుకోవడంతో వేటు వేసి సైలెంట్​గా ఉన్నట్లు విమర్శలున్నాయి.

2018 నుంచి పక్కదారి..

మొదటి విడతలో 2018లో రైతుబంధు చెక్కుల రూపంలో ఇచ్చారు. అప్పట్లోనే చాలా మంది రైతుల డబ్బులు కాజేశారనే ఆరోపణలున్నాయి. 2019లో ఆన్ లైన్ లో రైతుల పేర్లు, అకౌంట్​ నెంబర్లు ఫీడ్  చేసే క్రమంలోనే స్కాంకు తెరలేపినట్లు పక్కాగా తెలుస్తోంది. భూమి ఒకరిపై ఉంటే మరొకరి పేరు ఆన్ లైన్ లో ఎక్కించారని రైతులు ఆరోపిస్తున్నారు. 

ఇలా 64 మంది రైతుల సమాచారాన్ని ఆన్ లైన్ లో తప్పుగా నమోదు చేసి డబ్బులు దండుకున్నారని అంటున్నారు. 2018 నుంచి రైతుబంధు రావడం లేదని గట్టు మండలం బలిగిరి గ్రామానికి చెందిన అహ్మద్  డీఏవోకు కంప్లైంట్ చేయడంతో ఎంక్వైరీ చేశారు. డబ్బు పడుతున్నట్లు రికార్డుల్లో ఉండగా, అకౌంట్  నెంబర్​ తనది కాదని చెప్పడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. వేరే రైతు అకౌంట్​లో డబ్బులు పడుతున్నట్లు గుర్తించి ఏఈవోను ప్రశ్నించగా, తప్పు జరిగిందని ఆమె ఒప్పుకోవడంతో నాలుగు రోజుల కింద సస్పెన్షన్​ వేటు వేశారు. 

ప్రతిపక్ష లీడర్, మీసేవా నిర్వాహకులే సూత్రధారులు..

గట్టు మండలానికి చెందిన ఒక ప్రతిపక్ష లీడర్ తో పాటు ముగ్గురు మీసేవా నిర్వాహకులు రైతుబంధు స్కాంకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. మూడు మీసేవా కేంద్రాలను ఒకే చోట పెట్టి ఈ స్కాంకు కుట్ర చేశారని అంటున్నారు. 
 

ఏఈవోకు కొంత డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. పాస్​ బుక్​ ఎవరి పేరు మీద ఉంటే వారి పేరును మాత్రమే ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాల్సి ఉంది. కానీ 64 మంది రైతుల ఎంట్రీలో తప్పులు చేసినట్లు గుర్తించారు. భర్తలకు బదులుగా భార్యల అకౌంట్లు, భార్యల అకౌంట్లకు బదులుగా భర్తల అకౌంట్లు, భూమికి సంబంధం లేని వ్యక్తుల అకౌంట్లు ఎంట్రీ చేశారు. 

ఈ స్కామ్ లో దాదాపు కోటి రూపాయల వరకు స్వాహా చేశారని అనుమానిస్తుండగా, ప్రస్తుతం రూ.36.60 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వ్యవసాయ శాఖలో 10 రోజుల కింద ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటికీ సీక్రెట్ గా ఉంచారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష లీడర్ తో పాటు ముఖ్యమైన వ్యక్తులు ఉండడం వల్ల ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాజేసిన రైతుబంధు డబ్బులను రికవరీ చేయాలని రైతులు డిమాండ్  చేస్తున్నారు.

కమిషనర్  నుంచి ఆదేశాలు రావాలి

రైతుబంధు స్వాహాపై అగ్రికల్చర్  కమిషనర్  నుంచి ఎంక్వైరీకి ఆదేశాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.36.60 లక్షలు స్వాహా అయినట్లు తేలింది. ఏఈవోను సస్పెండ్  చేసి నివేదికను ఆఫీసర్లకు పంపించాం. త్వరలో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాం.
– గోవింద్ నాయక్, డీఏవో