తమ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని దావా వేయడంపై ఎట్టకేలకు యునైటెడ్ స్టేట్స్-ఆధారిత ఫార్మాస్యూటికల్ కంపెనీ జాన్సన్ & జాన్సన్ మూల్యాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో 8.9 బిలియన్ డాలర్లను (రూ.73,000 కోట్లు) జాన్సన్ & జాన్సన్ చెల్లించనుంది. తమపై దాఖలైన పిటిషన్లను పరిష్కరించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ ప్రతిపాదనకు కోర్టు, పిటిషనర్లు ఆమోదిస్తే.. అమెరికా చరిత్రలోనే ఓ ఉత్పత్తికి సంబంధించి అతిపెద్ద పరిహారం కేసుల్లో ఒకటిగా ఈ కేసు నిలవనుంది. సాధారణంగా పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు ఇలాంటి భారీ పరిహార చెల్లింపు వ్యాజ్యాలు ఎదురవుతుంటాయి. కానీ ఓ టాల్కం పౌడర్ ఉత్పత్తకి సంబంధించి పిటిషన్ దాఖలు కావడం ఇదే మొదటి సారి.
క్యాన్సర్ కు దారితీసే ఆస్బెస్టాస్ ఆనవాళ్లు జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ లో ఉన్నాయంటూ గత కొన్ని రోజుల క్రితం ఆ కంపెనీపై అమెరికాలో వేలాది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ విషయంపై స్పందించిన జాన్సన్ అండ్ జాన్సన్ .. ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. కానీ ఆ తర్వాత తమ ఉత్పత్తుల్లో హానికారకాలు లేవంటూనే 2020లో అమెరికా, కెనడాల్లో ఉన్న బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రూ.73,000 కోట్లను ఒకేసారి కాకుండా వచ్చే 25 ఏళ్లలో చెల్లించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ అంగీకరిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
