కాంగ్రెస్​ లీడర్ల ఘర్​ వాపసీ..అసెంబ్లీ ఎలక్షన్ ​తర్వాత మారుతున్న సీన్

కాంగ్రెస్​ లీడర్ల ఘర్​ వాపసీ..అసెంబ్లీ ఎలక్షన్ ​తర్వాత మారుతున్న సీన్
  •     కండువాలు వేసుకునేందుకు క్యూ కడుతున్న సెకండ్​ క్యాడర్
  •     ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట చేరికలు
  •     లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​లో జోష్

నిజామాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​లోకి వలసలు పెరిగాయి. ఆయా కారణాలతో కాంగ్రెస్​ పార్టీని వీడి, వివిధ పార్టీల్లోకి వెళ్లిన వారు ఘర్​ వాపసీ బాట పడుతున్నారు. దీంతో ఆ పార్టీలో  జోష్​నిండుతోంది. సెకండ్​ క్యాడర్ ​లీడర్లు కొందరు ఇప్పటికే కండువాలు ధరించగా, సరైన సమయం కోసం మరికొందరు ఎదురు చూస్తున్నారు. చేరికలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్​ బలం పెరుగుతోంది.

జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట చేరికలు ఉంటున్నాయి. అయితే కాంగ్రెస్ ​మాత్రం వివాదరహిత నేతలకే వెల్​కమ్ చెబుతోంది. బోధన్​ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్​రెడ్డి ఘర్​వాపసీని పర్యవేక్షిస్తున్నారు. చేరికల తేదీల కోసం నేతలు ఆయనతో టచ్​లో ఉంటున్నారు. 

మున్సిపాలిటీల్లో మారిన సీన్​

బోధన్​ మున్సిపాలిటీ అనధికారికంగా ఇప్పటికే కాంగ్రెస్​ఆధీనంలోకి వచ్చింది. చైర్​పర్సన్​ తూము పద్మ,  ఆమెకు మద్దతుగా ఉన్న మెజార్టీ బీఆర్ఎస్, మజ్లిస్​ కౌన్సిలర్లు గులాబీకి కటీఫ్ చెప్పారు. ఆర్మూర్​ మున్సిపాలిటీలో కాంగ్రెస్​కు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. సీఎం రేవంత్​రెడ్డి అపాయింట్​మెంట్ ​కోసం 11 మంది కౌన్సిలర్లు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్​ మాజీ నేత, నందిపేట మండలానికి చెందిన యాక్టీవ్​లీడర్​ రేపోమాపో కాంగ్రెస్​లో చేరడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇప్పటికే 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు.

మాక్లూర్ ​సింగిల్ ​విండో లోనూ బీఆర్ఎస్ ​కు చెందిన ఐదుగురు డైరెక్టర్లు పార్టీకి రిజైన్​ చేశారు. బాల్కొండలో మాజీ స్పీకర్, రాజ్యసభ సభ్యుడు సురేశ్​రెడ్డి ముఖ్య అనుచరుడు, వేంపల్లి సింగిల్​విండో చైర్మన్ జక్క రాజేశ్వర్ ​కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు. మరో ముఖ్య నేత కొట్టాల చిన్నారెడ్డి బీఆర్ఎస్ ను​ వీడి కాంగ్రెస్​లో చేరారు. 

స్థానిక సంస్థల లీడర్లు..

బోధన్​ సెగ్మెంట్​లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కు కుడిభుజంలా వ్యవహరించిన సాలూర సింగిల్​ విండో చైర్మన్​ అల్లె జనార్ధన్,​ పలువురు తాజామాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, లోకల్​ లీడర్లు బీఆర్ఎస్​ను వీడారు. అర్బన్​లో మాజీ డిప్యూటీ మేయర్​ఫయీం ఎంఐఎం నుంచి కాంగ్రెస్​ గూటికి వచ్చారు.​ రూరల్
​నియోజకవర్గంలోని డిచ్​పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన స్థానిక సంస్థల నేతలు కాంగ్రెస్​లో చేరడంతో పార్టీకి అదనపు బలం లభించింది.

కాంగ్రెస్​లో చేరికలు

బీర్కూర్ :  బీర్కూర్​ మండలం రైతునగర్​కు చెందిన పలువురు శుక్రవారం కాంగ్రెస్​లో చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ ఏనుగు రవీందర్​రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్​లో చేరుతున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మండలాధ్యక్షుడు బోయిని శంకర్, కాంగ్రెస్ ​లీడర్లు పాల్గొన్నారు.