విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారు

విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారు

మంచిర్యాల జిల్లా: ఫుడ్ పాయిజన్ తో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న జైపూర్ తెలంగాణ సంక్షేమ బాలుర పాఠశాల విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సీవో స్వరూప రాణి తెలిపారు. గురువారం రాత్రి అన్నం తిన్న కాసేపటికే మొత్తం 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది... వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కాగా... ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సీవో  స్వరూప రాణి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. భోజనంలో భాగంగా విద్యార్థులకు అందించిన బిస్కెట్లు పాడయ్యాయన్నారు. విద్యార్థులకు బిస్కెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సమయంలో పాడైన వాసన రావడంతో ప్రిన్సిపాల్ బిస్కెట్లు పంచడం ఆపేశారన్నారు. అయితే అప్పటికే 16 మంది విద్యార్థులు ఆ బిస్కెట్లను తిన్నారని, దీంతో వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని హాస్పిటల్ కు తరలించారని చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నామన్న ఆమె... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని చెప్పారు.  

కాగా... జైపూర్ తెలంగాణ సంక్షేమ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా నీరసించిపోవడంతో సెలైన్ ఎక్కించారు. ఇప్పుడు విద్యార్థులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడం కలకలం రేపింది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఆరా తీయడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమై వంటకు ఉపయోగించిన ఆహార పదార్థాలను పరిశీలించారు.