టీఆర్ఎస్​లో జోష్​ కనిపిస్తలేదు

టీఆర్ఎస్​లో జోష్​ కనిపిస్తలేదు

మాజీని కాదు.. తెలంగాణ బిడ్డను
నా వెంట వేల మంది స్టూడెంట్స్ ఉన్నరు
మాజీ ఎంపీ సీతారాం నాయక్‍

వరంగల్‍ రూరల్‍, వెలుగు: ‘సభలు, సమావేశాల్లో అందరూ నన్ను మాజీ.. మాజీ అంటున్నరు. నేను మాజీ కాదు. తెలంగాణ బిడ్డను. ఉద్యమానికి నా శక్తినంతా ధారపోసిన. నా వెంట వేలమంది స్టూడెంట్స్​ఉన్నరు. నన్ను ఎవరు చూసినా.. చూడకున్నా ఇట్లనే ఉంటా. ఇట్లనే మాట్లాడతా’ అని మహబూబాబాద్‍ మాజీ ఎంపీ సీతారాం నాయక్‍ అన్నారు. శుక్రవారం హన్మకొండలో టీఆర్​ఎస్​ వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్‍ మాట్లాడుతూ టీఆర్‍ఎస్ లో అప్పటి జోష్ లేదన్నారు. ఎవడో హక్కు లేనివాడొచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఒక్కొక్కడు ఇంట్లోనే ఉంటన్లు. ఏది ఆ సత్తా..? ఏది అప్పటి ఉత్సాహం.? కార్యకర్తలు చలనం లేకుండా ఇట్లనే ఉంటే పార్టీకి, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‍కు నష్టం జరుగుతుందన్నారు. కొన్ని ఓపెన్ గా డిస్కస్‍ చేయాలని చెబుతూ.. టీఆర్‍ఎస్‍ సర్కారు జనాలకు చెప్పినవన్నీ చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా అలా చేయదు. జనాలు అవకాశం ఇస్తే అవి పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం టీఆర్‍ఎస్‍ అంటే యూత్ నెగెటివ్​గా ఉన్నరని.. యువతను సముదాయించాలని కార్యకర్తలకు సూచించారు.

సభ్యత్వానికి నేను ఒక్క పైసా ఇయ్య

‘పార్టీ హైకమాండ్‍ ఇచ్చిన సభ్యత్వ టార్గెట్‍ పూర్తి చేస్తాం. మిగతా విషయంలో ఏ సపోర్ట్​చేయమన్నా చేస్తా తప్పితే.. నేను ఒక్కపైసా కూడా ఇవ్వను. కార్యకర్తలే కట్టుకోవాలె.. ఇన్​చార్జులే వసూళ్లు చూసుకోవాలి’ అని ప్రభుత్వ చీఫ్‍ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍ అన్నారు. నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదంటే ఓ ఇరవై, ముప్పై వేలు చేద్దామనుకున్నామని.. సీఎం కేసీఆర్‍ ఏకంగా 60 వేలు చేయాలని చెప్పారన్నారు. పార్టీలో గులుగుడులు, అలుగుడులు ఉన్నమాట వాస్తవమేనని.. ఉద్యమంలో పనిచేసి, పోలీసులతో తన్నులు తిన్నవారు అలా ఉండటంలో తప్పేమి లేదన్నారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‍గా జిల్లాకు చెందిన కన్నెబోయిన రాజయ్య యాదవ్‍కు మరోసారి సీఎం కేసీఆర్‍ అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి మిగతా వాటిని వదిలేయాలని సూచించారు.