నర్సంపేటలో బీరు సీసాతో జర్నలిస్ట్ పై దాడి

నర్సంపేటలో బీరు సీసాతో జర్నలిస్ట్ పై దాడి

నర్సంపేట / వరంగల్, వెలుగు : బీరు సీసాతో ఓ వ్యక్తి జర్నలిస్టుపై దాడికి దిగిన ఘటన శుక్రవారం రాత్రి వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేకు చెందిన జర్నలిస్టు పాలంచ సత్యనారాయణ శుక్రవారం రాత్రి అంగడి సెంటర్ వైపు తన బైక్​పై వెళ్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి టూ వీలర్ పై వచ్చిన వ్యక్తి సత్యనారాయణ బైక్ ను ఢీకొట్టాడు. కింద పడిపోయిన జర్నలిస్టు తేరుకునే లోపే సదరు వ్యక్తి తన బండిలో నుంచి బీరు బాటిల్ తీసి దాడి చేసి, పరారయ్యాడు. తీవ్ర గాయాలైన సత్యనారాయణను స్థానికులు నర్సంపేట జిల్లా జనరల్​ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో స్పాట్​కు చేరుకుని పరిశీలించారు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముష్కే శ్రీనివాస్​ తెలిపారు. కాగా, జర్నలిస్టుపై దాడి చేసిన నిందితులను చట్టపరంగా శిక్షించాలని టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పొడేటి అశోక్, జర్నలిస్టుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితుడిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐని కలిసి బాధిత జర్నలిస్టుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.