ఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లోని ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు..

ఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లోని ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు..

వెలుగు, నెట్​వర్క్​:  గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్​జిల్లాల్లోని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శోభాయాత్రలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చండ్రుగొండ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పల్లకీ శోభాయాత్ర నిర్వహించి అన్నదానం చేశారు. వేదపండితులు రామకృష్ణమూర్తి, వేణుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన రైతు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాలుగు గ్రామాలకు చెందిన 60 మంది యువకులు రక్తదానం చేశారు. పలుమార్లు రక్తదానం చేసిన దాతలను సన్మానించారు. మధిర షిర్డీ సాయిబాబా గుడిలో గురుపౌర్ణమితో పాటు ఆలయ 29వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. 

ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని సాయిబాబా ఆలయంలోనూ ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి రామాలయంలోని కృష్ణానందగిరి స్వామి ఆశ్రమంలో గురుపూజలు, భజనలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం అందించారు. జనగామ జిల్లా బీజేపీ ఆఫీస్​లో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్​ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కాశీబుగ్గ రంగనాయక స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్వంచలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తి గీతాల కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ చేపట్టగా ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.