మీడియా స్వేచ్ఛపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

మీడియా స్వేచ్ఛపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
  • భావ ప్రకటననుపాలకులు అడ్డుకోవద్దు
  • లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన తప్పదు  
  • టీడబ్ల్యూజేఎఫ్, హెచ్​యూజే నిరసన ర్యాలీలో జర్నలిస్ట్ నేతలు 

ముషీరాబాద్, వెలుగు: మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు జర్నలిస్ట్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.  మీడి యా సంస్థలు, జర్నలిస్టులపైనా పాలకులు దాడులను ఆపకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.  ఢిల్లీలో న్యూస్ క్లిక్​తో పాటు పలు మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఈడీ, ఢిల్లీ పోలీసుల దాడులను ఖండిస్తూ శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్),హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

మాజీ ఎడిటర్లు తెలకపల్లి రవి, ఎస్. వినయ్​కుమార్, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, బి.బసవపున్నయ్య హాజరై మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మీడియా, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపడం సహించరానిదన్నారు. తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్నారనే కక్షతో మీడియా సంస్థలను కేంద్రం బెదిరించి తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. 

ఈ నిరసన ప్రదర్శనలో హెచ్ యూజే అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్, ఫెడరేషన్ రాష్ట్ర నేతలు చంద్రశేఖర్, గండ్ర నవీన్, రాజశేఖర్, గుడిగ రఘు, తన్నీరు శ్రీనివాస్, మధుకర్, హెచ్​యూజే నాయకులు క్రాంతి, మాధవరావు, డేగ కుమార్, విజయ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి ఆనందం, లాయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (ఐలు)  పార్థసారథి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ తదితరులు మద్దతు ప్రకటించారు.