బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి : జర్నలిస్టులు

బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి : జర్నలిస్టులు
  • అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన

మంచిర్యాల, వెలుగు: చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్​ చేశారు. శుక్రవారం మందమర్రిలో జరిగిన పార్టీ మీటింగ్​లో జర్నలిస్టులను ఉద్దేశించి వాడు, వీడూ అంటూ కించపర్చేలా మాట్లాడారని మండిపడ్డారు. వంకర రాతలు రాయకుండా వారిని సక్కగ జేయడానికి ఏం చేయాలో అది చేయండి అంటూ పార్టీ కార్యకర్తలను జర్నలిస్టులపై దాడులకు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

సుమన్ ​వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం మాట్లాడుతూ.. బాల్క సుమన్ బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన ఎన్నికల ప్రచార వార్తలను జిల్లావ్యాప్తంగా నిషేధిస్తామని హెచ్చరించారు.

జర్నలిస్టులపై సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, మాట్లాడిన తీరును రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పింగళి సంపత్ రెడ్డి, కోశాధికారి కాశెట్టి వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడు సురేశ్ చౌదరి, పడాల సంతోష్, రవిరాజ్, సభ్యులు రాజేశ్వర్, రాజు, కొండ శ్రీనివాస్,  జర్నలిస్టులు ఆకుల రాజు, రమేశ్​రెడ్డి, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.