హైదరాబాద్ లో ఇయ్యాల (డిసెంబర్ 3న) జర్నలిస్టుల మహా ధర్నా

హైదరాబాద్ లో  ఇయ్యాల (డిసెంబర్ 3న) జర్నలిస్టుల మహా ధర్నా

బషీర్​బాగ్, వెలుగు: గత 12 ఏండ్లుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 3న మాసబ్ ట్యాంక్​లోని  రాష్ట్ర సమాచార భవన్ ఎదుట ‘మహా ధర్నా’ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు కె. విరాహాత్ అలీ తెలిపారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. 

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన జర్నలిస్టులకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మహా ధర్నాకు అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు హాజరవుతారన్నారు. 

అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రారంభించాలని, ఆరోగ్య బీమా పథకాన్ని తక్షణమే పునరుద్దరించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు వై. నరేందర్ రెడ్డి, కె. రాంనారాయణ, వి.యాదగిరి, శిగ శంకర్ గౌడ్  పాల్గొన్నారు.