- వద్దంటే డిలీట్ చేసుకోవచ్చని వెల్లడి
- సైబర్ సెక్యూరిటీ కోసమేనన్న కేంద్రం
- పర్సనల్ డేటాపై చోరీకే అంటున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: ఇండియాలో అమ్మే అన్ని సెల్ ఫోన్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ డిఫాల్ట్‌గా ఉండాలని మొబైల్ కంపెనీలకు కేంద్రం ఆదేశించింది. యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేసుకునే వీల్లేకుండా చూడాలని కోరింది. కేంద్రం ఆదేశాలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నదని మండిపడ్డాయి. ఇది ముమ్మాటికి దేశ ప్రజల పర్సనల్ డేటాపై నిఘా పెట్టడమే అని విమర్శించాయి.
కేంద్రం ఆదేశాలపై ఇటు యాపిల్ లాంటి సంస్థల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ యాప్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఆ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చని చెప్పింది. సైబర్ మోసాలు, ఫోన్ దొంగతనాల నుంచి ప్రజలను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశమని, నిఘా పెట్టడం కాదని కేంద్రం పేర్కొన్నది.
యాప్ ను పరిచయం చేస్తున్నం.. జ్యోతిరాదిత్య
సైబర్ మోసాలను నిరోధించేందుకు యాప్ తీసుకొస్తే, ప్రతిపక్షాలు గొంతెందుకు చించుకుంటున్నాయని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశ్నించారు. ఈ యాప్ వినియోగం పూర్తిగా వినియోగదారుల ఇష్టమని, ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఒకవేళ కొత్త ఫోన్‌లో ఈ యాప్ వచ్చినా, వినియోగదారులకు ఇష్టం లేకపోతే దాన్ని అన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చని తెలిపారు.
‘సాధారణంగా కొత్త ఫోన్ కొన్నప్పుడు గూగుల్ మ్యాప్స్, క్రోమ్ వంటి కొన్ని యాప్‌లు డిఫాల్ట్‌గా వస్తాయి. మీకు గూగుల్ మ్యాప్ ఇష్టం లేకపోతే దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. సంచార్ సాథి యాప్ ప్రజల సేఫ్టీ కోసం తీసుకొచ్చినం. మా పని కేవలం యాప్‌ను అందరికీ పరిచయం చేయడం వరకే. దాన్ని వాడాలా.. వద్దా.. అనేది ఫోన్ ఓనర్ ఇష్టం. కొందరు ఈ యాప్‌పై అసత్యాలు
ప్రచారం చేస్తున్నారు’’ అని సింధియా మండిపడ్డారు.
స్నూపింగ్ యాప్ అన్న ప్రతిపక్షాలు
ప్రజల గొంతు నొక్కడానికి కేంద్రం చేస్తున్న మరో ప్రయత్నమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ పోకడ అని మండిపడ్డారు. ఫోన్లపై నిఘానో, సంచార్ సాథీ యాప్ విషయమో కాదని, అన్ని అంశాల్లోనూ కేంద్రం వైఖరి అనుమానాస్పదంగానే ఉందని ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. ఇదొక స్నూపింగ్ యాప్ అని, ప్రజల పర్సనల్ డేటాను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నదని మండిపడ్డారు.
రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాల్లో ఇలాంటి విధానాలు ఉంటాయని కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం విమర్శించారు. కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ఇది పెగాసస్ ప్లస్ ప్లస్ అని, బిగ్ బ్రదర్ (మోదీ) మన ఫోన్‌ను, మొత్తం మన ప్రైవేటు జీవితాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛపై జరుగుతున్న దాడి అని అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
