జర్నలిస్టులను  ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

జర్నలిస్టులను  ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

హైదరాబాద్: జర్నలిస్టులు సూపర్ స్ప్రెడ్డర్స్ కాదు... ఫ్రంట్ లైన్ వారియర్స్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ‘‘దాసోజు ఫౌండేషన్'' ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో కీర్తిశేషులు స్వర్గీయ దాసోజు క్రిష్ణామాచారి జ్ఞాపకార్ధం జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సరుకుల వితరణ జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంని పురస్కరించుకొని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు అంజలి ఘటిస్తూ నివాళులు అర్పించారు దాసోజు. అమరవీరుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు దాసోజు శ్రవణ్. జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ తో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలని, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా దాసోజు డిమాండ్ చేశారు. 

''జర్నలిస్టులని సూపర్ స్ప్రెడ్డర్స్ విభాగంలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్, నర్సు, ఇతర మెడికల్ సిబ్బందిలా జర్నలిస్టు లని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని కోరారు. కరోనా మహమ్మారికి ఎదురుగా నిలబడి అనేక మంది జర్నలిస్ట్ లు అహర్నిశలు పనిచేశారని, యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, వారందరికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇచ్చే నష్టపరిహారం ఇవ్వాలని, జర్నలిస్ట్ కుటుంబాలని ఆదుకోవాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అందే అన్ని సదుపాయాలు జర్నలిస్టులకి కూడా అందాలని కోరారు దాసోజు.
''త్యాగాల తెలంగాణ... నేడు కేవలం కేసీఆర్ కుటుంబ భోగాల తెలంగాణగా మారిపొయిందని విమర్శించారు దాసోజు శ్రవణ్.  ''తెలంగాణ వచ్చి ఏడేళ్ళు గడిచింది. కోటి ఆశలతో దాదాపు నాలుగు కోట్ల మంది రోడ్లపై వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడారు. 1500  మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత  రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అనేక కలలు కన్నాం.  తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం జరుగుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశించాం. ప్రజలందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని కలలు కన్నాం.  కానీ ఆ కలలన్నీ కల్లగా మార్చేసింది కేసీఆర్ సర్కార్. త్యాగాల తెలంగాణ నేడు కేవలం టీఆర్ఎస్ పార్టీ అధినాయకులకు, కేసీఆర్ కుటుంబానికి భోగాల తెలంగాణగా  మారింది.  ఇది దుర్మార్గం.'' అని ధ్వజమెత్తారు దాసోజు.

''ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్ళు తెరిచి ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో.. ఏ లక్ష్యం కోసం 1500బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారో .. వాళ్ళ లక్ష్యాలు సఫలీకృతం చేయాలి. నేడు రాష్ట్రంలో నలఫై లక్షల మంది నిరుద్యోగ యువత దిక్కు తోచని పరిస్థితిలో వుంది. రిక్రూట్మెంట్ క్యాలెండర్ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం వుంది. నియంతృత్వ ధోరణి కొనసాగుతున్న టీఆర్ఎస్ పాలను చరమగీతం పాడుతూ అమరవీరుల స్థూపం సాక్షిగా మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం వుంది'' అని పేర్కొన్నారు దాసోజు.