బషీర్ బాగ్, వెలుగు : చట్టసభలో జర్నలిస్టు గొంతుకగా ఉంటానని ఎమ్మెల్సీ, సియాసత్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ ఆమెర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుక్రవారం బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే ఆఫీసులో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే) సంయుక్తాధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. యాభై ఏండ్లుగా తన తాత ఆబిద్ అలీఖాన్, తండ్రి జహేద్ అలీ ఖాన్, నేడు తాను యూనియన్ లో క్రియాశీలకంగా ఉన్నట్టు గుర్తుచేశారు.
జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా తనవంతు చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. సియాసత్ పత్రికా ఫౌండర్ ఆబిద్ అలీఖాన్ ఉమ్మడి రాష్ట్రంలోని సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించారని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ గుర్తుచేశారు. కార్యక్రమంలో పీసీఐ మాజీ మెంబర్ ఎంఏ.మాజీద్, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రాజేశ్, రాష్ట్ర చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.