ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు కేటాయించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్​భాస్కర్‍ వెల్లడించారు. ఆదివారం గ్రేటర్‍ వరంగల్‍ ప్రెస్‍క్లబ్‍లో టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‍రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.  ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హెల్త్ స్కీంను అన్ని ప్రైవేట్‍ హాస్పిటళ్లలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. గౌరవ అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర జనరల్‍ సెక్రటరీ విరాహత్‍ అలీ మాట్లాడుతూ..  టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల పక్షపతిగా, ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తోందన్నారు. 65 ఏండ్ల పోరాట చరిత్ర, త్యాగాలకు కేంద్రంగా దేశ, రాష్ట్ర స్థాయిలో నిర్విరామంగా పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు దాసరి కృష్టారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు తాడూరి కర్ణాకర్‍, రాష్ట్ర కార్యదర్శి గాడిపల్లి మధు, సభ్యులు వెంకటరమణ, గడ్డం రాజిరెడ్డి, విద్యాసాగర్‍తో పాటు యూనియన్‍ నేతలు అయిలు రమేశ్‍, జిల్లా కార్యదర్శి కంకణాల సంతోష్‍, వరంగల్‍ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామచందర్‍రావు, దుర్గాప్రసాద్‍ పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై దాడులు

రూ.6.5లక్షల క్యాష్ స్వాధీనం

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ దేశాయిపేటలోని శ్రీనివాస కాలనీలో ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి, భారీగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. కాలనీలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రాగా దాడులు చేశామన్నారు. మొత్తం రూ.6.5లక్షల క్యాష్ పట్టుబడిందన్నారు. ఆరు సెల్​ఫోన్లు సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద రూ.62వేల క్యాష్, ఒక కారు, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

పీడీఎస్ రైస్ పట్టివేత

కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వేర్వేరు చోట్ల 74 క్వింటాళ్ల పీడీఎస్ రైస్​ను సీజ్ చేసినట్లు ఎస్సై చరణ్ తెలిపారు. దేశరాజ్ పల్లి క్రాస్ వద్ద 10 క్వింటాళ్లు, ఉప్పల్ రైల్వే స్టేషన్​లో 64 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 12మందిని అరెస్ట్ చేశామన్నారు.
 

ఆర్ఏల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలె

వర్ధన్నపేట, వెలుగు: వీఆర్ఏల సమస్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పందించాలని నియోజకవర్గ వీఆర్ఏలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించాలని కోరారు. ఆదివారం వర్ధన్నపేటలోని లక్ష్మీ గార్డెన్స్‌‌లో ఎమ్మెల్యే ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి రాగా, వీఆర్ఏలు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకోవడంతో గేటు బయట ఆందోళనకు దిగారు. 42రోజులుగా ఆందోళన చేస్తున్నా.. స్పందించకపోవడం సిగ్గుచేటలన్నారు. అనంతరం ఎమ్మెల్యే వారిని లోపలికి పిలిపించి, మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నిండు గర్భిణిపై తీవ్ర నిర్లక్ష్యం

కమలాపూర్, వెలుగు: ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతోందని ఆఫీసర్లు చెబుతున్నా.. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ నిండు గర్భిణి పురుటి నొప్పులతో ఆసుపత్రికి రాగా.. డ్యూటీ డాక్టర్లు డుమ్మా కొట్టడం, అంబులెన్స్ సైతం అందుబాటులో లేకపోవడంతో ఆ మహిళ ప్రసవ వేదన అనుభవించింది. వివరాల్లోకి వెళితే.. కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఓ మహిళ శనివారం రాత్రి పురుటి నొప్పులతో స్థానిక 30పడకల ఆసుపత్రికి వచ్చింది. 24గంటలు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్లు డుమ్మా కొట్టడంతో.. సిబ్బంది హుజురాబాద్​కు తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో అంబులెన్స్ కూడా అందుబాటు లేకపోవడం, ఆ సమయంలో ప్రైవేటు వాహనాలు లేకపోవడంతో ఆ మహిళ ప్రసవ వేదన అనుభవించింది. చివరికి ఓ వెహికల్ దొరకగా.. ఆమెను హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ పండింటి పాపకు జన్మనిచ్చింది. డ్యూటీలో లేని డాక్టర్లపై చర్యలు తీసుకొని, ఆసుపత్రి నిర్వహణపై పర్యవేక్షణ చేయాలని కుటుంబసభ్యులు కోరారు.

దళితులంతా కేసీఆర్ వైపే ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: రాష్ట్రంలోని దళితులంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని దళితులంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​కు వస్తున్న ప్రజల ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు ఏకనాయకత్వం కింద పనిచేయాలని కోరారు. గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలన్నారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా పనిచేస్తే క్షమించేది లేదన్నారు. నియోజకవర్గానికి 3వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, 500 దళిత బంధు యూనిట్లు మంజూరయ్యాయన్నారు.

బావిలోపడి మహిళ మృతి

గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తార్య తండాకు చెందిన జాటోత్ కమిళి(40) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం కమిళి గొర్లను మేపడానికి అడవి బాట పట్టింది. ఈక్రమంలో బాట పక్కన ఉన్న బావిలో కాలుజారి పడిపోయింది. గమనించిన రైతులు ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె అప్పటికే చనిపోయింది.

పాముకాటుతో ఆటో డ్రైవర్..

మరిపెడ, వెలుగు: పాముకాటుతో ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జరిగింది. టౌన్​కు చెందిన బొమ్మగాని మల్లేశ్(30) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కరిచింది. ఆదివారం ఉదయం నోట్లో నుంచి నురగలు వస్తుండగా గమనించిన కుటుంబసభ్యులు ట్రీట్మెంట్ కోసం ఖమ్మం పట్టణానికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు

హనుమకొండ సిటీ, వెలుగు: విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని సీపీఐఎంఎల్(న్యూడెమోక్రసీ) రాష్ట్ర నాయకుడు గోవర్ధన్​ మండిపడ్డారు. హనుమకొండ హంటర్​ రోడ్డులోని ఎలక్ట్రిసిటీ డిప్లొమా ఇంజినీర్స్​అసోసియేషన్​ హాల్​లో ఆదివారం పీడీఎస్​యూ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల నిర్వహణకు ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​ గా హాజరైన గోవర్దన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి ఎలాంటి నిధులు కేటాయించడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరున ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తోందని మండిపడ్డారు జాతీయ విద్యావిధానం పేరున పేదలకు విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని, నూతన జాతీయ విద్యావిధానాన్ని విద్యార్థి లోకం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పీడీఎస్​యూ మహాసభల ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరుశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజయ్​ కన్నా, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నిండు గర్భిణిపై తీవ్ర నిర్లక్ష్యం

కమలాపూర్, వెలుగు: ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతోందని ఆఫీసర్లు చెబుతున్నా.. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ నిండు గర్భిణి పురుటి నొప్పులతో ఆసుపత్రికి రాగా.. డ్యూటీ డాక్టర్లు డుమ్మా కొట్టడం, అంబులెన్స్ సైతం అందుబాటులో లేకపోవడంతో ఆ మహిళ ప్రసవ వేదన అనుభవించింది. వివరాల్లోకి వెళితే.. కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఓ మహిళ శనివారం రాత్రి పురుటి నొప్పులతో స్థానిక 30పడకల ఆసుపత్రికి వచ్చింది. 24గంటలు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్లు డుమ్మా కొట్టడంతో.. సిబ్బంది హుజురాబాద్​కు తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో అంబులెన్స్ కూడా అందుబాటు లేకపోవడం, ఆ సమయంలో ప్రైవేటు వాహనాలు లేకపోవడంతో ఆ మహిళ ప్రసవ వేదన అనుభవించింది. చివరికి ఓ వెహికల్ దొరకగా.. ఆమెను హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ పండింటి పాపకు జన్మనిచ్చింది. డ్యూటీలో లేని డాక్టర్లపై చర్యలు తీసుకొని, ఆసుపత్రి నిర్వహణపై పర్యవేక్షణ చేయాలని కుటుంబసభ్యులు కోరారు.

వీఆర్ఏల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలె

వర్ధన్నపేట, వెలుగు: వీఆర్ఏల సమస్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పందించాలని నియోజకవర్గ వీఆర్ఏలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించాలని కోరారు. ఆదివారం వర్ధన్నపేటలోని లక్ష్మీ గార్డెన్స్‌‌లో ఎమ్మెల్యే ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి రాగా, వీఆర్ఏలు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకోవడంతో గేటు బయట ఆందోళనకు దిగారు. 42రోజులుగా ఆందోళన చేస్తున్నా.. స్పందించకపోవడం సిగ్గుచేటలన్నారు. అనంతరం ఎమ్మెల్యే వారిని లోపలికి పిలిపించి, మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

‘ఆయుష్మాన్ భారత్’ను వినియోగించుకోవాలి

నర్సింహులపేట(దంతలపల్లి), కురవి, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ను ప్రజలంతా వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ కోరారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పీహెచ్ సీని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కొవిడ్ టీకాల వివరాలను తెలుసుకున్నారు. కరోనా సంక్షోభాన్ని కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కుందని తెలిపారు. బూస్టర్ డోస్ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని డాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో హరీశ్ రాజ్, ఆర్డీవో రమేశ్, డాక్టర్లు వేదకిరణ్, తహశీల్దార్ కిషోర్ పాల్గొన్నారు. అనంతరం కురవి మండలంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు, గిరిజన మోర్చా రాష్ర్ట అధ్యక్షులు హుస్సేన్ నాయక్, వి.రాజవర్దన్ రెడ్డి, గుగులోతు లక్ష్మణ్​నాయక్ ఉన్నారు.

ముగిసిన నిట్ కాన్వొకేషన్

కాజీపేట, వెలుగు: వరంగల్ నిట్​లో రెండ్రోజుల కాన్వొకేషన్ ఆదివారంతో ముగిసింది. రెండోరోజు పీహెచ్​డీ, పీజీ స్టూడెంట్లకు పట్టాలు అందజేశారు. చీఫ్ గెస్టులుగా సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డా.ఎన్. కలై సెల్వి హాజరయ్యారు. నిట్ డైరెక్టర్ ఎన్ వీ రమణారావుతో కలిసి 889 మందికి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కలై సెల్వి మాట్లాడుతూ.. మన దేశం సాంకేతికపరంగా అనేక వనరులు కలిగి ఉందంటూ గతంలోనే అబ్దుల్ కలాం అన్నారని, నేడు అవి నిజం అవుతున్నాయన్నారు. టెక్నాలజీ ద్వారా ఎంతోమార్పు వచ్చిందన్నారు. మెరుగైన సమాజం కోసం టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో నిట్ స్టూడెంట్లు ముందుండాలని ఆకాంక్షించారు.

టీచర్ల బదిలీలు వెంటనే చేపట్టాలి

హనుమకొండ సిటీ, వెలుగు: టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్​పీసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్​ వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చీఫ్​ గెస్ట్​ గా హాజరై మాట్లాడారు.  రాష్ట్రంలో  2 వేలకు పైగా ప్రధానోపాధ్యాయులు, 8 వేలకు పైగా సబ్జెక్ట్​ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.  వీటిని ప్రమోషన్ ల ద్వారా, మిగతా ఖాళీలను టీఆర్టీ  ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యూఎస్​పీసీ  స్టీరింగ్ కమిటీ సభ్యుడు,  డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.  ఖాళీగా ఉన్న  పోస్టులన్నీ భర్తీ చేయాలని ,  పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలన్నారు.  సర్దుబాటు పేరుతో పాఠశాలలను మూసి వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.  ఈ  సామూహిక నిరాహార దీక్షలో వివిధ సంఘాల నాయకులు  డాక్టర్ ఎం.గంగాధర్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే .సోమశేఖర్, నాయకులు కె. భోగేశ్వర్, రమేష్, తిరుపతి ,  వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, గోవిందరావు, రవీందర్ రాజు, రఘుపతి , సుదర్శనం, రాజు, కుమార్, శ్రీనివాస్ ,ఏకాంతం రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఫ్రీడం ఫైటర్ల భూములకు ఎమ్మెల్యే ఎసరు

జనగామ, వెలుగు: జనగామలోని చెంపక్ హిల్స్​లో ఫ్రీడం ఫైటర్ల భూములను స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించుకోవాలని చూస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి ఆరోపించారు. సర్వేనెంబర్ 140లో గతంలో ప్రభుత్వం ఫ్రీడం ఫైటర్లకు భూములు కేటాయించిందని, ఎమ్మెల్యే ఒత్తిడితో ఆయా భూములను రెవెన్యూ ఆఫీసర్లు చదును చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం సదరు స్థలాన్ని సీపీఎం లీడర్లు పరిశీలించారు. అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులైన చల్లా రామిరెడ్డి, నీలారపు ఎర్రయ్య, కోట నరసింహారెడ్డికి గత ప్రభుత్వం రెండేసి ఎకరాల చొప్పున చంపక్ హిల్స్ లో కేటాయించిందన్నారు. వీరికి గత పాస్ బుక్ తో పాటు ప్రస్తుత పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నట్లు చెప్పారు. భూమి ఇచ్చినప్పటి నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసి చదును చేసుకుని బోరు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వారికి ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని జనగామ తహశీల్దార్ కు చెప్పారని ఆరోపించారు. దీంతో వారి పట్టాలను రద్దు చేయగా బాధితులు హైకోర్టుకు వెళ్లారన్నారు. ఇదిలా ఉండగా సదరు భూములో పంటలు సాగుచేసుకుంటుండగా ఎమ్మెల్యే ఆదేశాలతో శనివారం జనగామ తహశీల్దార్, ఆర్డీఓ లు వెళ్లి రజాకార్లను మరిపించే లా పంటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఆఫీసర్లపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, మండల కార్యదర్శి బోడ నరేందర్ ఉన్నారు.

కరీమాబాద్ లో కత్తులతో ఫైటింగ్

దాడులు చేసుకున్న ఇరువర్గాలు

వరంగల్​సిటీ, వెలుగు:రంగల్ సిటీలోని కరీమాబాద్ ఉర్సుబొడ్రాయి ప్రాంతంలో కత్తుల దాడులు కలకలం రేపాయి. ఇరు వర్గాలు కత్తులతో దాడులు చేసుకోగా.. పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కరీమాబాద్ కు చెందిన బత్తిని మహేందర్ రేషన్ బియ్యం దందా చేసేవాడు. అతని వద్ద గతంలో బత్తిని అఖిల్ అనే వ్యక్తి పనిచేసేవాడు. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో.. అఖిల్ పనిమానేశాడు. సొంతంగా చికెన్ షాప్ నడిపిస్తున్నాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వైరం పెరిగింది. ఆదివారం ఉదయం మహేందర్, అఖిల్ గ్యాంగ్​లు కత్తులతో దాడులు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రాగంపేటలో గెస్ట్ లెక్చరర్ మృతి

నర్సంపేట, వెలుగు: కొలువు పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై, అనారోగ్యం పాలైన  ఓ గెస్ట్ లెక్చరర్ ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన జె.రాజశేఖర్ గతంలో బెల్లంపల్లి, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పొలిటికల్ సైన్స్ గెస్టు లెక్చరర్ గా పనిచేశాడు. కాలేజీలో అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందిస్తేనే వీరికి కనీస వేతనం లభించే చాన్స్ ఉంది. అయితే 2022–2023 అకడమిక్ ఇయర్ లో రాజశేఖర్ కు చాన్స్ దక్కకపోవడంతో అతని జాబ్ పోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురై మంచాన పడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. ఇటీవలే కేయూ నుంచి పీహెచ్​డీ గోల్డ్​మెడల్ కూడా ఆయన అందుకున్నాడు. బాధిత కుటుంభానికి రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని స్థానికులు సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. 

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది?

ఏం చేశారని కేంద్ర మంత్రులు తిరుగుతున్నరు?

మహబూబాబాద్​అర్బన్, ​కురవి, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు నెరవేర్చాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మహబూబాబాద్ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కురవిలో ఆసరా పెన్షన్ కార్డులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్ర మంత్రులు పగటి వేషగాళ్ల మాదిరిగా తిరుగుతున్నారని విమర్శించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో ఓ ప్రకటన విడుదల చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఆయా కార్యక్రాల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్, కురవి ఎంపీపీ గుగులోతు రవి నాయక్ తదితరులున్నారు.