2022లో తెలుగు సినిమాల జర్నీ

2022లో  తెలుగు సినిమాల జర్నీ

మరికొద్ది గంటల్లో క్యాలెండర్ మారిపోయి 2023 వస్తోంది... ఈ ఏడాదిలో ఊహించని సంఖ్యలో దాదాపు మూడు వందల తెలుగు సినిమాలు విడుదలవ్వడం. హిట్స్​ విషయంలోనూ రికార్డు క్రియేట్​ చేయడం, థియేటర్లకు జనం మళ్లీ మామూలుగా రావడం 2022 స్పెషాలిటీ. ఈ ఏడాది తెలుగు సినిమాల జర్నీ ఎలా ఉందంటే...

ఫిల్మ్ ఇండస్ట్రీలో  రెండేళ్లుగా కరోనా ఎఫెక్ట్‌‌‌‌తో సినిమాల సంఖ్య తగ్గినా.. 2022లో మాత్రం ఆ రెండేళ్లకు సరిపడా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.  గతంలో ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో ఈ ఏడాది సినిమాలు రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్‌‌‌‌తో  కలిపి   ఏకంగా 297 సినిమాలు రిలీజ్ అయ్యి.. ఈ ఏడాది టాలీవుడ్‌‌‌‌లో సరికొత్త రికార్డ్ గా నిలిచిపోయింది. కొవిడ్‌‌‌‌ భయాలతో డైలమాలో పడ్డ థియేటర్ల వ్యవస్థ గాడిలో పడింది. అలాగే బాలీవుడ్, కోలీవుడ్‌‌‌‌, మాలీవుడ్‌‌‌‌లతో పోలిస్తే.. ఎక్కువగా జనం థియేటర్లకు వచ్చింది కూడా టాలీవుడ్‌‌‌‌లోనే. ఆ రకంగా ఇండియన్ సినిమాకు కొత్త జోష్‌‌‌‌ నింపింది టాలీవుడ్‌‌‌‌. మునుపటిలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో తెలుగు సినిమా గెలిచింది. ఓవైపు ఓటీటీలో సినిమాలు, వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లు చూస్తూనే, మరోవైపు థియేటర్స్‌‌‌‌లో విడుదలైన చిత్రాలనూ ఆదరించారు. మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు సినిమాలే అన్ని రకాలుగా హిట్​ కొట్టాయి.

సర్‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ సక్సెస్‌‌‌‌లు

భారీ అంచనాలతో వచ్చి ఊహించని ప్లాప్ అందుకున్న సినిమాలు కొన్నైతే.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాలను అందుకున్న చిత్రాలు మరికొన్ని. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీ అందరినీ సర్‌‌ప్రైజ్ చేస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. అలాగే కళ్యాణ్‌‌‌‌ రామ్ హీరోగా ‘బింబిసార’.. దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా ‘సీతారామం’, తిరువీర్ హీరోగా ‘మసూద’ అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలు అందుకున్నాయి. ఇక నిఖిల్ హీరోగా చందు మొండేటి తీసిన ‘కార్తికేయ 2’ ప్యాన్ ఇండియా వైడ్‌‌‌‌ సక్సెస్ అందుకుని ఆశ్చర్యపరిచింది. 


బాక్సాఫీస్ బొనాంజా

కరోనాతో రెండేళ్లుగా చిక్కుల్లో పడిన టాలీవుడ్‌‌‌‌కు ఈ ఏడాది పెద్ద విజయాలు దక్కాయి. అయితే జనవరి టైమ్‌‌‌‌కు కొంత కరోనా కట్టుబాట్లు ఉండడంతో సంక్రాంతికి రావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. అయినా ధైర్యం చేసి ‘బంగార్రాజు’లుగా వచ్చిన నాగార్జున, నాగచైతన్య సంక్రాంతి సక్సెస్‌‌‌‌ను అందుకున్నారు. ఫిబ్రవరిలో పవన్‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌ హీరోగా వచ్చిన ‘భీమ్లా నాయక్‌‌‌‌’ డీసెంట్‌‌‌‌ హిట్‌‌‌‌గా నిలిచింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌‌‌ హీరోలుగా రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మార్చిలో విడుదలై, వరల్డ్ వైడ్‌‌‌‌గా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డుల మోత మోగించి.. పలు ఇంటర్నేషనల్‌‌‌‌ అవార్డ్స్ అందుకోవడంతో పాటు ఆస్కార్‌‌‌‌‌‌‌‌ రేసులోనూ పోటీపడుతోంది. ఇక ‘సర్కారు వారి పాట’తో హీరోగా సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. మరోవైపు అడివి శేష్‌‌‌‌ హీరోగా ‘మేజర్‌‌‌‌‌‌‌‌’ సినిమాను నిర్మించి నిర్మాతగానూ ప్యాన్‌‌‌‌ ఇండియా సక్సెస్‌‌‌‌ కొట్టారు. మరోవైపు వెంకటేష్, వరుణ్‌‌‌‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తీసిన ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్‌‌‌‌ 3’ మరోసారి కామెడీతో కలెక్షన్స్ రాబట్టింది. చిరంజీవి హీరోగా మోహన్ రాజా తీసిన ‘గాడ్ ఫాదర్’, సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ చిత్రాలు యావరేజ్‌‌‌‌గా ఆడాయి. ‘మేజర్‌‌‌‌‌‌‌‌’ తర్వాత ‘హిట్‌‌‌‌ 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అడివి శేష్‌‌‌‌కు మరో విజయం లభించింది. ఇక ఈ ఏడాది రవితేజ హీరోగా మూడు సినిమాలు రాగా వాటిలో మూడో చిత్రం ‘ధమాకా’కి పాజిటివ్ టాక్ వచ్చింది.   

తొలి అడుగులోనే.. 

మారుతున్న ట్రెండ్‌‌‌‌కి తగ్గట్టు.. కొత్త కథలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి ముందుంటారు కొత్తతరం దర్శకులు.  అలాగే ఈ ఏడాది కూడా కొంత మంది కొత్త డైరెక్టర్లు  తమ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌‌‌‌ను అందుకున్న వారున్నారు. వారిలో తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్‌‌‌‌ను తనఖాతాలో వేసుకున్నాడు మల్లిడి వశిష్ట్. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంకోసం వశిష్ట్ ఓ కొత్త లోకాన్ని సృష్టించాడు. అలాగే కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌‌‌‌గా‌‌‌‌  ‘డీజే టిల్లు’ తెరకెక్కించిన విమల్ కృష్ణ, హారర్‌‌‌‌‌‌‌‌  థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ‘మసూద’తో భయపెట్టిన సాయి కిరణ్​,  ‘ఒకే ఒక జీవితం’ అంటూ డిఫరెంట్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌తో శ్రీకార్తిక్ విజయాలు అందుకున్నారు. ఇక వీరితో పాటుగా మరికొంత మంది నూతన దర్శకులు తమ టాలెంట్‌‌‌‌ను ప్రూవ్ చేసుకున్నారు. ‘పంచతంత్రం’ సినిమాతో హర్ష పులిపాక, ‘స్వాతిముత్యం’తో లక్ష్మణ్​ కె, సుమ లీడ్ రోల్‌‌‌‌గా ‘జయమ్మ పంచాయతీ’ తెరకెక్కించిన విజయ్ కుమార్ కలివరపు ఈ ఏడాది దర్శకులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

కొత్త అందాలు

టాలీవుడ్‌‌‌‌లో ప్రతి సంవత్సరం కొత్త అందాలు పలకరిస్తూనే ఉంటాయి. అలాగే ఈ ఏడాది  కూడా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్స్‌‌‌‌ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ అలియా భట్. బాలీవుడ్‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌గా పేరున్నా.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడా మంచి మార్కులు కొట్టేసింది అలియా. అలాగే బ్రిటిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ కూడా ఈ సినిమాతో పరిచయం అయ్యి సక్సెస్‌‌‌‌ను అందుకుంది. అలాగే రాఘవేంద్రరావు సూపర్ విజన్‌‌‌‌లో వచ్చిన ‘పెళ్లి సందD’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఆ సినిమాతో సక్సెస్‌‌‌‌ అందుకోకపోయినా, బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ మాత్రం దక్కించుకుంది. ఇక మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’తో మెస్మరైజ్ చేయగా, అనన్య పాండే మాత్రం ‘లైగర్’తో నిరాశపరిచింది. వీరితో పాటు కయాదు లోహర్, మిథిలా పార్కర్, గెహ్నా సిప్పి,సంయుక్త మీనన్, రాజిషా విజయన్, సయీ మంజ్రేకర్, ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు.

భారీ హైప్.. కానీ ఫ్లాప్ 

‘ఆర్ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌’ లాంటి భారీ విజయాలను అందుకున్న టాలీవుడ్‌‌‌‌కు భారీ పరాజయాలు కూడా తప్పలేదు. హై ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్‌‌‌‌తో విడుదలైన ‘రాధేశ్యామ్‌‌‌‌’ బాక్సాఫీస్‌‌‌‌ దగ్గర ఆ అంచనాలను అందుకోలేక ప్రభాస్‌‌‌‌కు ఫ్లాప్‌‌‌‌ను ఇచ్చింది. చిరంజీవి, రామ్‌‌‌‌చరణ్‌‌‌‌తో కొరటాల శివ తీసిన ‘ఆచార్య’ కూడా అంతే. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’ కూడా పరాజయం చవిచూసింది. అలాగే వరుణ్ తేజ్ ‘గని’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌‌‌‌ ‘పక్కా కమర్షియల్‌‌‌‌’, రామ్‌‌‌‌ ‘వారియర్‌‌‌‌’, రవితేజ ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌‌‌‌ డ్యూటీ’, నాని ‘అంటే సుందరానికీ’, నితిన్‌‌‌‌ ‘మాచర్ల నియోజకవర్గం’ లాంటి సినిమాలు అంచనాలను అందుకోవడంలో తడబడ్డాయి. 

డబ్బింగ్ ధమాకా

తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కొన్ని డబ్బింగ్‌‌‌‌ సినిమాలు సత్తా చాటాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం యశ్ హీరోగా ప్రశాంత్ నీల్‌‌‌‌ తీసిన ‘కేజీఎఫ్‌‌‌‌ 2’. టాలీవుడ్‌‌‌‌ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక గ్రాస్‌‌‌‌ సాధించిన డబ్బింగ్ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. మరో శాండిల్ వుడ్ సినిమా ‘కాంతార’తో ఎవరూ ఊహించని స్థాయిలో సూపర్ సక్సెస్‌‌‌‌ను అందుకున్నాడు రిషబ్ శెట్టి. కమల్ హాసన్ హీరోగా లోకేష్‌‌‌‌ కనగరాజ్ తీసిన ‘విక్రమ్‌‌‌‌’ స్క్రీన్‌‌‌‌ప్లే మేజిక్‌‌‌‌.. బాక్సాఫీస్‌‌‌‌ను షేక్ చేసింది. ఇక హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్‌‌‌‌‌‌‌‌ 2’ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్‌‌‌‌లో అద్భుతాలు సృష్టించింది. అలాగే కార్తి ‘సర్దార్‌‌‌‌‌‌‌‌’, సుదీప్ ‘విక్రాంత్‌‌‌‌ రోణ’, ప్రదీప్ రంగనాథన్ ‘లవ్‌‌‌‌ టుడే’ తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. లాల్ సింగ్ చద్దా, పొన్నియిన్‌‌‌‌ సెల్వన్ 1, బ్రహ్మాస్త్ర, ఈటీ, రాకెట్రి, కోబ్రా, ప్రిన్స్, కనెక్ట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.