- దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు పరిశీలిస్తాం
- కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా
- మంత్రి తుమ్మలకు ఫోన్
- వచ్చే వానాకాలం యూరియా అవసరాలపై ఆరా
హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్లో తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి యూరియా అవసరాలపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి, ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌కు యూరియా కేటాయింపును 10 లక్షల టన్నుల నుంచి 11.50 లక్షల టన్నులకు పెంచాలని కోరారు.
రైతులు పత్తి నుంచి మక్క సాగు వైపు మొగ్గు చూపడం, ప్రారంభ నిల్వలు తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం అధికంగా ఉంటుందని, ముందస్తుగా బఫర్ స్టాక్ అవసరమని పేర్కొన్నారు. అలాగే, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతీ నెల 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని విన్నవించారు.
రామగుండం ఫ్యాక్టరీ నుంచి గరిష్ట కేటాయింపులు చేయండి
రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గరిష్ట కేటాయింపులు చేయాలని, ప్లాంట్ నిరంతర కార్యకలాపాలు కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నాగేశ్వరరావు కేంద్రమంత్రిని కోరారు. దేశీయ సంస్థలు ఆర్సీఎఫ్, క్రిభ్కో, ఆర్ఎఫ్సీఎల్ నుంచి సరఫరా తగ్గిపోవడంతో మార్చి నెలలో కేటాయించిన 1.34 లక్షల టన్నుల్లో దాదాపు 0.65 లక్షల టన్నుల కొరత ఏర్పడిందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్ ద్వారా పారదర్శకత పెరిగి బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను దాచిపెట్టడం వంటి సమస్యలు తగ్గుతున్నాయని తెలిపారు. స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. యూరియా యాప్ అమలు తీరు బాగుందని, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
