
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి రాక
పార్టీ ఆఫీస్ బేరర్లు, కోర్ కమిటీతో సమావేశాలు
సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ
రాత్రికి హరిత ప్లాజాలో బస.. మరుసటి రోజు సభ్యత్వ నమోదు
అంబేద్కర్ కాలేజీలో మొక్కలు నాటే ప్రోగ్రామ్
భారీగా ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు
ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలతో కాషాయవర్ణమైన సిటీ
హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల పర్యటన కోసం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా ఆదివారం హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి హైదరాబాద్ కు వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నడ్డా చేరుకుంటారు. అక్కడ పార్టీ ఆఫీస్ బేరర్లతో సమావేశమవుతారు. జిల్లాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు తీరు, భవిష్యత్ కార్యాచరణ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే సభకు హాజరుకానున్నారు.
బీజేపీలోకి 25 వేల మంది తెలుగు తమ్ముళ్లు
రాష్ట్రంలోని టీడీపీ క్యాడర్ మొత్తాన్ని బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా నడ్డా పర్యటన సాగుతోంది. బహిరంగ సభ సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో 9 జిల్లాల టీడీపీ అధ్యక్షులతోపాటు మొత్తం జిల్లా కార్యవర్గాలు బీజేపీలో చేరనున్నాయి. సుమారు 20 వేల నుంచి 25 వేల మంది తెలుగు తమ్ముళ్లు ఈ సభ ద్వారా తమ పార్టీలో చేరబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలను సభకు భారీగా తరలిస్తున్నారు.
రేపు సభ్యత్వ నమోదులో..
బహిరంగ సభ తర్వాత నడ్డా నేరుగా బేగంపేట్ లోని హరిత ప్లాజాకు చేరుకోనున్నారు. అక్కడ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణ, పార్టీలోకి పెరుగుతున్న వలసలు, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీకి వెళ్లనున్నారు. అక్కడ మొక్కలు నాటి అటు నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. నడ్డా పర్యటన సందర్భంగా ఆయనతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీలు అర్వింద్, సంజయ్, సోయం బాపురావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొననున్నారు. నడ్డా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ఆయన పర్యటించే రూట్లలో కాషాయ జెండాలు, స్వాగత ఫ్లెక్సీలు, పార్టీ తోరణాలు భారీగా ఏర్పాటు చేశారు. దీంతో నగరం కాషాయవర్ణంగా మారింది.
టీఆర్ఎస్ టార్గెట్గా ప్రసంగం
బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును నడ్డా ఎండగట్టనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా పేదల ఆరోగ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజల దృష్టికి తీసుకురానున్నారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని ప్రస్తావించనున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, తెలంగాణపై అభివృద్ధి పరంగా తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్లో జోష్ తీసుకొచ్చేలా నడ్డా ప్రసంగం ఉంటుందని నేతలు చెబుతున్నారు.