సంగారెడ్డి జిల్లాలో ఫేస్ రికగ్నైజేషన్ తో పింఛన్ అక్రమాలకు చెక్

సంగారెడ్డి జిల్లాలో ఫేస్ రికగ్నైజేషన్ తో  పింఛన్ అక్రమాలకు చెక్
  • తొలగనున్న వృద్ధుల ఇబ్బందులు...సంగారెడ్డి జిల్లాలో 1,55,837 మంది పింఛన్ దారులు

సంగారెడ్డి, వెలుగు: పింఛన్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు సెర్ఫ్ ఆధ్వర్యంలో ఫేస్ రికగ్నైజేషన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ మరో రెండు నెలల్లో అమలులోకి రానున్నట్టు సమాచారం. ఈ విధానం అమలైతే పింఛన్ల పంపిణీ పారదర్శకంగా జరగడమే కాకుండా వృద్ధుల ఇబ్బందులు తొలగిపోతాయి. జిల్లా వ్యాప్తంగా ఆసరా పథకం కింద వివిధ కేటగిరీల్లో మొత్తం  1,55,837 మంది పింఛన్ దారులు ఉన్నారు. ప్రతినెలా మొత్తం రూ.36 కోట్ల15 లక్షల19 వేల చెల్లింపులు చేస్తున్నారు. 

పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల ద్వారా..

ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారు. పింఛన్​డబ్బులు డ్రా చేసుకునే సమయంలో వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రలు సరిగ్గా లేకపోవడంతో సకాలంలో పైసలు అందక అవస్థలు పడుతున్నారు. వేలికి ఉన్న రేఖలు అరిగిపోవడంతో వేలిముద్రలు రానివారికి జీపీ సెక్రటరీలు డబ్బులు డ్రా చేసి ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు అందుబాటులో లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో చనిపోయిన వృద్ధుల పేర్లతో ఇప్పటికి పింఛన్లు పొందుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వృద్ధుల ఇబ్బందులతో పాటు అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పింఛన్లు అందించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఫేస్ రికగ్నైజేషన్ తో..

మారుతున్న కాలానుగుణంగా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పింఛన్​దారులు డబ్బులు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సెర్ఫ్ ఆధ్వర్యంలో కార్యాచరణ మొదలుపెట్టగా ప్రత్యేక  యాప్ ద్వారా లబ్ధిదారుల ముఖాలను నిర్ధారణ చేసి పింఛన్ పంపిణీ చేయనున్నారు. దీంతో వేలిముద్రల సమస్య, చనిపోయిన వారి పేర్లతో ఇతరులు పింఛన్లు పొందడం వంటివి జరగవు. వృద్ధులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం కోసం పింఛన్​దారులు ఎదురుచూస్తున్నారు. 

జిల్లాలో వివిధ పింఛన్లు ఇలా

వృద్ధులు    59,083
వితంతువులు    70,673
దివ్యాంగులు    14,465
కల్లుగీత కార్మికులు    813
చేనేత కార్మికులు    683
ఒంటరి మహిళలు    7,475
బీడీ కార్మికులు    112
ఇతరులు    2,533