65 శాతం తగ్గిన జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్ ప్రాఫిట్‌‌

65 శాతం తగ్గిన జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్ ప్రాఫిట్‌‌

మార్చి క్వార్టర్‌‌‌‌లో నికర లాభం రూ.1,322 కోట్లు

న్యూఢిల్లీ : ముడిసరుకుల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్ నికర లాభం 65 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) తగ్గింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో రూ.3,741 కోట్ల లాభాన్ని ప్రకటించిన కంపెనీ, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో రూ.1,322 కోట్లు సాధించింది.  కంపెనీ మొత్తం ఆదాయం  రూ.47,427 కోట్ల నుంచి రూ.46,511 కోట్లకు తగ్గింది. ఈ టైమ్‌‌ పీరియడ్‌‌లో జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌ ఖర్చులు  రూ.43,170 కోట్ల నుంచి రూ.44,401 కోట్లకు పెరిగాయి.

 ఈ ఖర్చుల్లో ముడిసరుకుల ఖర్చులు  రూ.24,541 కోట్లుగా, ఇతర ఖర్చులు రూ.7,197 కోట్లుగా ఉన్నాయి.  2023–24 ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే కంపెనీకి రూ.8,873 కోట్ల నికర లాభం, రూ.1,76,010 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో  రూ.4,139 కోట్ల లాభాన్ని, రూ.1,66,990 కోట్ల ఆదాయాన్ని కంపెనీ ప్రకటించింది. కిందటి ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకి రూ.7.30 ఫైనల్ డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 

జేఎస్‌డబ్ల్యూ చేతికి మొజాంబిక్‌‌ మైనింగ్ కంపెనీ   

మొజాంబిక్‌‌లోని మైనింగ్ కంపెనీ మినస్‌‌ డె రెవుబో (ఎండీఆర్‌‌‌‌) ను  కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్ ప్రకటించింది.  ఈ డీల్‌‌తో స్టీల్ ప్రొడక్షన్‌‌లో కీలకమైన కోకింగ్ కోల్‌‌ సప్లయ్ మరింత ఈజీగా మారుతుంది. జేఎస్‌‌డబ్లూ స్టీల్ సబ్సిడరీ  నేచురల్ రిసోర్సెస్‌‌  ద్వారా ఎండీఆర్‌‌‌‌ను కొనుగోలు చేయనుంది. మొత్తం 92.19 శాతం వాటాను 73.75 మిలియన్ డాలర్లకు దక్కించుకోనుంది. ఈ డీల్‌‌తో   మొజాంబిక్‌‌లోని 800 మెట్రిక్ టన్నుల ప్రీమియం హార్డ్ కోకింగ్‌‌ కోల్ రిజర్వ్‌‌లు జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌కు దక్కుతాయి.  జేఎస్‌‌డబ్ల్యూ షేరు శుక్రవారం 1.70 శాతం పెరిగి రూ.902 దగ్గర సెటిలయ్యింది.