హైదరాబాద్: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో NOTAకు మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 924 ఓట్లు పడ్డాయి. ఎన్నికల సంస్కరణలలో భాగంగా బ్యాలెట్లో ‘నోటా (None of the Above)’ ఆప్షన్ను చేర్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ ఇష్టం లేకపోతే నోటాకు ఓటేయచ్చు. అయితే నోటాతో ఎన్నికల ఫలితాలేమీ మారవు. నోటాకు పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికపై ఎలాంటి ప్రభావం పడదు.
నోటాకు పడిన ఓట్లు పోగా మిగతా ఓట్లలో ఎక్కువ వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ఉద్దేశ్యం. ఒక నియోజకవర్గంలో దాదాపు అందరు అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నా, వారు మంచివారు, సమర్థులు కాకున్నా ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఓటరు చేతిలో శక్తిమంతమైన ఆయుధంగా నోటా మారుతుంది.
Also Read:- జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు.. కానీ.. తెలంగాణ బీజేపీ కార్యాలయం దగ్గర సంబురాలు !
పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చక కూడా చాలామంది ఓటేయడం లేదన్న వాదన ఉంది. ఈ క్రమంలో.. నోటాకు ప్రాధాన్యం కల్పిస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక.. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫలితం విషయానికొస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల 729 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. నవీన్ యాదవ్కు మొత్తం 98 వేల 988 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74 వేల 259 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17 వేల 61 ఓట్లు పోలవడం గమనార్హం.
