హైదరాబాద్: బీజేపీ తెలంగాణ కార్యాలయం దగ్గర సంబురాలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ సంబురం చేసుకోవడమేంటని సంభ్రమాశ్చర్యాలకు లోనైతే మీరు పప్పులో కాలేసినట్టే. బీజేపీ గెలుపు సంబరాలు బిహార్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ గురించి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో బీజేపీ నేతలు తెలంగాణలో సంబరాలు చేసుకున్నారు.
ఈ సంబురాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కూడా భాగం కానున్నారు. డప్పు చప్పులకు బీజేపీ మహిళ కార్యకర్తలు ఫుల్ జోష్తో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాణాసంచా పేల్చి.. స్వీట్లు తినిపించుకున్నారు. బిహార్లో గెలుపుపై తెలంగాణలో బీజేపీ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు.. జూబ్లీహిల్స్ ఫలితం వేళ రాజకీయ వర్గా్ల్లో ఆసక్తికరంగా మారాయి.
వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ బీజేపీ మొదటి నుంచి ఈ స్థానంలో ఏమాత్రం ఆశలు పెట్టుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు పెద్దగా కనిపించలేదు. పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా పేరున్న ఏ ఒక్క నేత ప్రచారంలో పాల్గొనకపోవడంతో ఆ పార్టీ కేడర్కూడా జూబ్లీహిల్స్పై ఆశలు వదిలేసుకుంది.
Also Read:- జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో NOTAకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. అయినప్పటికీ కీలక నేతలెవరూ ప్రచారంలో భాగం కాకపోవడం, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపునకు కృషి చేయకపోవడం చర్చనీయాంశం అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోవడం గమనార్హం.
