
- న్యాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: తమ మైనర్ కొడుకుపై జూబ్లీహిల్స్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని యూసఫ్‌గూడకు చెందిన దంపతులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. గత డిసెంబర్లో పక్క ఇంట్లో స్నానం చేస్తున్న వ్యక్తిని తమ కొడుకు వీడియో తీశాడని ఆరోపిస్తూ.. సదరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు రెండ్రోజులపాటు తమ కొడుకును చితకబాదారన్నారు.
అప్పటినుంచి తమ కొడుకు నడవలేని స్థితిలో ఉన్నాడని, స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌తో పాటు ఉస్మానియాలో ట్రీట్మెంట్అందించినా ఫలితం లేదని వాపోయారు. ఈ ఘటనపై పశ్చిమ మండల డీసీపీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. దీంతో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పోలీసులు ఒత్తిడి చేసి, డబ్బు ఆఫర్ చేస్తూ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే, ఈ ఆరోపణలను జూబ్లీహిల్స్ పోలీసులు ఖండించారు. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమేని జూబ్లీహిల్స్ ఏసీపీ పత్రిక ప్రకటన విడుదల చేశాడు.