అమరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్రం : ప్రజాప్రతినిధులు

అమరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్రం : ప్రజాప్రతినిధులు
  •     నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు 
  •     పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది అమరులు కాగా.. వారి త్యాగాల ఫలితంగానే 1948, సెప్టెంబర్ 17  న తెలంగాణ స్వేచ్ఛ ను పొందిందని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ప్రజా ప్రభుత్వం అధికారికంగా  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించింది. స్వరాష్ట్ర సాధనలో  అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబాలను సన్మానించారు. గురించి  మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ప్రజా ప్రభుత్వంలో అమరవీరులకు గౌరవం

సూర్యాపేట, వెలుగు: అమరుల త్యాగాల ఫలితంగానే  స్వరాష్ట్ర ఆకాంక్ష  నెరవేరిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.  బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో  తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు  పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని తెలిపారు.

 సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ అమరవీరులను గౌరవిస్తోందన్నారు. ఇటీవల కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి ‘చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం‘గా, హ్యాండ్ లూమ్ టెక్నాలజీ సంస్థకు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’  పేరు పెట్టామని తెలిపారు.  కొత్త ఉద్యోగకల్పన కోసం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించామని  చెప్పారు.  హుజూర్‌‌ నగర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.22.16  కోట్లతో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) మంజూరు చేశామన్నారు.

  రూ. 1450 కోట్లతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, రూ. 173 కోట్లతో నిధులు మంజూరు చేశామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, అడిషనల్ ఎస్పీ జనార్దన్, నరసింహ చారి, ఆర్డీఓ వేణుమాధవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్నాం : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  

నల్గొండ, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

 తెలంగాణ సాధనకు అనేక మంది అమరులయ్యారని, ఉద్యమంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సెప్టెంబర్ 17న విముక్తి పొందామన్నారు. . ప్రజా గాయకుడు గద్దర్ గారి పేరిట సినీ అవార్డులు ఏర్పాటు చేసి  అవార్డులు ఇచ్చామని, అందెశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని, తెలంగాణ త‌ల్లి రూపానికి రాజ ముద్ర వేసుకున్నామన్నారు.

 బహుజన ప్రజా రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించుకున్నామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్గొండలో 1.2 ఎకరాల్లో రూ. 5 కోట్లతో మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామన్నారు. 2027 వరకు ఎస్‌ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామన్నారు. మూసీ శుద్ధీకరణ చేసి జిల్లాకు తాగు, సాగు నీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.  మహాత్మాగాంధీ యూనివర్సిటీని మెరుగ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.  

రాచరిక వ్యవస్థ నుంచి...  ప్రజాపాలన : శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు:   హైదరాబాద్ సంస్థానంలోని రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాపాలన వ్యవస్థ ఏర్పాటు కోసం సాగించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో అమరులయ్యారని శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. భారత్​లో హైదరాబాద్​ సంస్థానం  చేరి 77 ఏండ్లు గడిచిన సందర్భంగా యాదాద్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 

నిరంకుశ రాచరిక వ్యవస్థను ధిక్కరిస్తూ ఆనాటి పత్రికలు ప్రజలను చైతన్యపరిచాయని తెలిపారు.  ఆ పోరాట యోధుల త్యాగ ఫలితంగానే మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం సిద్ధించాయని తెలిపారు.  భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్య, అప్పటి నల్గొండ జిల్లాలోని సాయుధ పోరాట యోధులను ఆయన గుర్తు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని చైర్మన్​ వివరించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, కలెక్టర్​ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్​, అడిషనల్​ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, మందడి ఉపేందర్​ రెడ్డి ఉన్నారు.