
- పుతిన్, నెతన్యాహు, రిషి గ్రీటింగ్స్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం 75 ఏండ్లు నిండాయి. మోదీ 75వ బర్త్ డే సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ మాజీ పీఎం రిషి సునాక్ సహా ప్రపంచ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, రష్యా సంబంధాల బలోపేతానికి మోదీ గొప్ప కృషి చేశారని పుతిన్ కొనియాడారు. కాగా, ప్రెసిడెంట్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ మోదీకి విషెస్ చెప్పారు.
అయితే, ట్రంప్ ఫోన్ చేసి విషెస్ చెప్పిన విషయాన్ని రాత్రి 10.53 గంటలకు మోదీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత 11.30 గంటలకు ఇదే విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా పంచుకున్నారు. ‘‘నా బర్త్ డేకు ఫోన్ చేసి విషెస్ చెప్పినందుకు థ్యాంక్యూ మై ఫ్రెండ్, ప్రెసిడెంట్ ట్రంప్. మీలాగే నేను కూడా ఇండియా, భారత్ సంబంధాల బలోపేతానికి, గ్లోబల్ పార్ట్నర్షిప్ పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం దిశగా మీ ప్రయత్నాలకు మద్దతిస్తున్నా” అని మోదీ పేర్కొన్నారు.
దీంతో ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ప్రధాని మోదీకి ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పా. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు. నరేంద్ర: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించేలా చూడటంలో మీ మద్దతుకు ధన్యవాదాలు” అని తెలిపారు.