
- మహబూబాబాద్ జిల్లాలో వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
నెల్లికుదురు, వెలుగు: వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు వీరగాని రాధమ్మ (80), ఇంటి పక్కన బంధువులైన అన్నదమ్ములు వీరగాని ఉప్పలయ్య, మహేశ్నివసిస్తుంటారు. కొంతకాలంగా ఉప్పలయ్య ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఇందుకు కారణం పెద్దమ్మ రాధమ్మ మంత్రాలు చేయడమే అని అనుమానించాడు. ఈ విషయాన్ని తన తమ్ముడు మహేశ్ కు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఈనెల 12న రాత్రి 11 గంటల సమయంలో పెద్దమ్మకి ఇంటికి వెళ్లి పిలిచారు. బయటకు వచ్చిన ఆమె తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసి పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నదమ్ములు ఉప్పలయ్య, మహేశ్‌తో పాటు వీరికి సహకరించిన రాజును నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ గణేశ్, ఎస్ఐ రమేశ్‌బాబు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.