నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ సీపీఐ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్తో ప్రజలకు నష్టం వాటిల్లుతోందన్నారు. మతం పేరుతో దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ కు సీపీఐ అండగా ఉంటుందని, అలాగే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చేది లేదని, పేదల కోసమే పోరాటం చేస్తామన్నారు. కమ్యూనిస్టు భావాలే రాజ్యాంగంలో ఉన్నాయని, సీపీఐ వందేండ్లుగా రాజీ లేని పోరాటాలు చేసిందన్నారు. వచ్చే నెల 26న సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సభకు 40 దేశాల నుంచి ప్రతినిధులు, 4 లక్షల మంది హాజరవుతారని చెప్పారు. గద్వాల నుంచి జాత బయలుదేరుతుందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ, నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఫయాజ్, బాలకిషన్, ఆంజనేయులు, విజయ రాములు, కేశవ గౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు.
